Saturday 30 November 2019

షోడశ వర్గీయ గ్రహ బలము :


షోడశ వర్గీయ గ్రహ బలము .

ప్రతి గ్రహమునకు క్షేత్రము ,హోర , ద్రేక్కాణ మొదలుగా గల షోడశ వర్గులను కనుగొనాలి. ప్రతి గ్రహమునకు మిత్ర వర్గులు ఎక్కువగా వుంటే ఆ గ్రహము బలమైనదిగాను , శత్రు వర్గులు ఎక్కువగా వుంటే ఆ గ్రహము బలహీనమైనది గాను భావించాలి.
ఉదాహరణ జాతకమునకు షోడశ వర్గులను వేసి బలాబలాలు చూద్దాం .
పుట్టిన తేదీ : 22.05.1980. సాయంత్రము 15:26. (మంగళగిరి లో పుట్టెను).
మొదట రవి గ్రహమును తీసుకొని షోడశ వర్గు చక్రములో అది వుండే రాశిని బట్టి అది మిత్ర క్షేత్రమో , లేదా శత్రు క్షేత్రమో తెలుసుకోవాలి.
జనన సమయమున రవి వృషభం లో 9డిగ్రీ .19ని లలో వున్నాడు . మిత్ర,శత్రు క్షేత్ర పట్టిక నుండి రవి యొక్క శత్రు, మిత్ర వర్గులను చూద్దాము.
క్షేత్రము లేక రాశి : రవి వృషభం లో వున్నాడు. రవికి వృషభం శత్రు క్షేత్రం. కావున రవికి శత్రు వర్గు 1.
హోర : రవి వృషభంలో 9డిగ్రీ .19ని లలో వున్నాడు . అనగా 15 డిగ్రీ లోపు వున్నాడు. కావున వృషభం లో 15 డిగ్రీ ఎదురుగా 4 అనగా కర్కాటకం లో వున్నాడు. రవికి కర్కాటకం శత్రు క్షేత్రం. కావున రవికి శత్రు వర్గు 1.
ద్రేక్కాణ : రవి వృషభం లో 10 డిగ్రీ లోపు వున్నాడు. కావున 10 డిగ్రీ ఎదురుగా గల సంఖ్య 2 అనగా వృషభం లో వున్నాడు. రవికి వృషభం శత్రు క్షేత్రం కావున రవికి శత్రు వర్గు 1.
చతుర్ధాంశ లేక పాదాంశ : రవి వృషభంలో 7 డిగ్రీ 30ని లను దాటి 15 డిగ్రీ లోపు వున్నాడు. కావున వృషభం లో 15 డిగ్రీ లోపు వున్నాడు. కావున 15డిగ్రీ ఎదురుగా గల సంఖ్య 5 అనగా సింహం లో వున్నాడు. రవికి సింహం స్వక్షేత్రం కావున రవికి మిత్ర వర్గు 1.
సప్తాంశ : రవి వృషభంలో 8 డిగ్రీ 34ని 17సె లను దాటి 12డిగ్రీ 51ని 26 సె లోపు వున్నాడు. కావున వృషభంలో 12డిగ్రీ 51ని 26సె ఎదురుగా గల సంఖ్య 10 అనగా మకరం లో వున్నాడు. రవికి మకరం శత్రుక్షేత్రం కావున రవికి శత్రు వర్గు 1.
నవాంశ : రవి వృషభం లో 6 డిగ్రీ 40 ని దాటి 10 డిగ్రీ లోపు వున్నాడు. కావున వృషభం లో 10 డిగ్రీ ఎదురుగా గల సంఖ్య 12 అనగా మీనం లో వున్నాడు. రవికి మీనం మిత్రా క్షేత్రం . కావున రవికి మిత్రా వర్గు 1.
దశాంశ : రవి వృషభం లో 9డిగ్రీ లను దాటి 12 డిగ్రీ లోపు వున్నాడు. కావున వృషభంలో 12 డిగ్రీ ఎదురుగా గల సంఖ్య 1 అనగా మేషం లో వున్నాడు. రవికి మేషం ఉచ్చ క్షేత్రం . కావున రవికి మిత్రా వర్గు 1.
ద్వాదశాంశ : రవి వృషభంలో 7 డిగ్రీ 30ని దాటి 10 డిగ్రీ లోపు వున్నాడు. కావున వృషభంలో 10 డిగ్రీ ఎదురుగా గల సంఖ్య 5 అనగా సింహంలో వున్నాడు. రవికి సింహం స్వక్షేత్రం . కావున రవికి మిత్రా వర్గు 1.
షోడశాంశ : రవి వృషభంలో 7డిగ్రీ 30ని దాటి 9డిగ్రీ 22ని 30సె లోపు వున్నాడు. కావున వృషభంలో 9డిగ్రీ 22ని 30సె ఎదురుగా గల సంఖ్య 9 అనగా ధనుస్సు లో వున్నాడు. రవికి దఃనుస్సు మిత్రా క్షేత్రం . కావున రవికి మిత్ర వర్గు 1.
వింశాంశ : రవి వృషభంలో 9డిగ్రీ లను దాటి 10డిగ్రీ 30ని లోపు వున్నాడు. కావున వృషభంలో 10డిగ్రీ 30ని ఎదురుగా గల సంఖ్య 3 అనగా మిధునంలో వున్నాడు. రవికి మిధునం శత్రు క్షేత్రం . కావున రవికి శత్రు వర్గు 1.
చతుర్వింశాంశ (సిద్ధాంశ ) : రవి వృషభంలో 7డిగ్రీ 45ని లను దాటి 10 డిగ్రీ లోపు వున్నాడు. కావున వృషభంలో 10 డిగ్రీ లకు ఎదురుగా గల సంఖ్య 11 అనగా కుంభంలో వున్నాడు. రవికి కుంభం శత్ర క్షేత్రం. కావున రవికి శత్రువర్గం 1.
నక్షత్రాంశ ( భాంశ ) : రవి వృషభంలో 8 డిగ్రీ 53 ని 20సె లను దాటి 10 డిగ్రీ లోపు వున్నాడు. కావున వృషభంలో 10 డిగ్రీ ఎదురుగా గల సంఖ్య 10 అనగా మకరంలో వున్నాడు. రవికి మకరం శత్రు క్షేత్రం . కావున రవికి శత్రు వర్గు 1.
త్రింశాంశ : రవి సరి రాశి యగు వృషభంలో 9డిగ్రీ 19ని లోపు వున్నాడు. అనగా మొదటి 12 భాగలలో వున్నాడు. అనగా మిధునంలో వున్నాడు. రవికి మిధునం శత్రు క్షేత్రం కావున రవికి శత్రు వర్గు 1.
ఖవేదాంశ : రవి వృషభంలో 9 డిగ్రీ దాటి 9 డిగ్రీ 45ని లోపు వున్నాడు. కావున వృషభంలో 9డిగ్రీ 45ని ఎదురుగా గల సంఖ్య 7 అనగా తుల లో వున్నాడు. రవికి తుల నీచ క్షేత్రం కావున రవికి శత్రు వర్గు 1.
అక్ష వేదాంశ : రవి వృషభంలో 8డిగ్రీ 40ని లను దాటి 9డిగ్రీ 20ని లోపు వున్నాడు. కావున వృషభంలో 9డిగ్రీ 20ని ఎదురుగా గల సంఖ్య 6 అనగా కన్యలో వున్నాడు. రవికి కన్య శత్రు క్షేత్రము కావున రవికి శత్రు వర్గు 1.
షష్ట్యంశ : షష్ట్యంశ లో ఒక్కొక్క భాగము 30 లిప్తలు ప్రమాణం కలిగి వుంటుంది. ఇచ్చట రవి సరి రాశి యగు వృషభంలో 9డిగ్రీ 19ని లోపు వున్నాడు. 9*2=18 భాగములు దాటి 19 లిప్తలులో వున్నాడు. అనగా రవి 19 వ భాగంలో సమ రాశి యగు వృషభంలో వున్నాడు. సమ రాసులలో 19 శుభము . కావున రవికి మిత్ర వర్గు 1.
రవికి మిత్ర వర్గులు 6. శత్రు వర్గులు 10. రవి ఎక్కువగా శత్రు వర్గులు కలిగి వుండుటచే రవి పాప ఫలితాలను ఇస్తాడు.
ఈ విధంగా ప్రతి గ్రహమునకు షోడశ వర్గులను కనుగొని ఆ గ్రహము యొక్క బలా బలాలను కనుగొన వచ్చును .

Friday 29 November 2019

సర్వాష్టకవర్గు ననుసరించి కొన్ని ఫలములు :

సర్వాష్టకవర్గు ననుసరించి కొన్ని ఫలములు :

సర్వాష్టకవర్గు నందు 30 కంటే ఎక్కువ బిందువులున్న రాశి కార్య సిద్ధిని కలిగించును. శుభ ఫలితాలను యిచ్చును. 25,30 ల మధ్య బిందువులున్న రాశి సాధారణ ఫలమును యిచ్చును. 25 కంటే తక్కువ బిందువులున్న రాశి ఫలితాన్ని యివ్వదు .
లగ్నములో 25 , ద్వితీయ స్థానములో 22 , తృతీయ స్థానములో 29 , చతుర్ధస్థానములో 24 , పంచమ స్థానములో 25 , శష్ట స్థానములో 34 , సప్తమ స్థానములో 19 , అష్టమ స్థానములో 24 , నవమ స్థానములో 29 , దశమ స్థానములో 36 , ఏకాదశ స్థానములో 54 , ద్వాదశ స్థానములో 16 కు తక్కువ కాకుండా బిందువులుంటే ఆ భావాలు బలమైనవి.
లగ్న మందు , చంద్ర రాశి లోనూ , 30 కన్నా ఎక్కువ బిందువులుండి , గురువు యొక్క శుభ దృష్టిని కలిగి వుంటే నాయకుడు లేదా అధికారి అవుతారు.
లగ్నములో 25 కంటే ఎక్కువ బిందువులుండి 9 వ స్థానములో 29 కంటే ఎక్కువ బిందువులుండి , ఆ రెండు స్థానాలకు పాప గ్రహ దృష్టి లేకపోతే సంపద లభిస్తుంది.
4 వ స్థానములో 24 కంటే ఎక్కువ బిందువులుండి , 2 వ స్థానములో 22 కంటే ఎక్కువ బిందువులుండి , ఆ రెండు భావములకు పాప గ్రహ దృష్టి లేకపోతే పూర్వీకుల ఆస్తి లభించును.
10 వ స్థానములో 36 కంటే ఎక్కువ బిందువులుంటే స్వయంగా ధనాన్ని సంపాదిస్తారు.
11 వ స్థానములో 36 కంటే ఎక్కువ బిందువులుంటే ద్రవ్య లాభం కలుగుతుంది.
1,4,7 స్థానములలో 30 కంటే ఎక్కువ బిందువులుంటే అధికారం లభిస్తుంది.
4 వ స్థానములో 40 కంటే ఎక్కువ బిందువులుండి , ఆ స్థానం గురువుకి ఉచ్చ స్థానమై , అచట గురువు యుండి , కుంభములో శని , మీనంలో శుక్రుడు , మకరంలో కుజుడు వుంటే జాతకుడు , విశేష ధనవంతుడు అవుతాడు.
11 వ స్థానంలో కంటే 12 వ స్థానంలో బిందువులు ఎక్కువగా వుంటే అధిక వ్యయం చేస్తాడు.

Thursday 28 November 2019

జాతకచక్ర పరిశీలనలో “దగ్ధరాశి”



జాతకచక్ర పరిశీలనలో “దగ్ధరాశి”

జాతకచక్రాన్ని పరిశీలన చెసేటప్పుడు,ప్రశ్నచక్రాన్ని పరిశీలన చేసేటప్పుడు దగ్ధరాశిని పరిశిలించటం ఎంతో ముఖ్యం.ముందుగా జాతకచక్రంలో జన్మతిధిని గాని,ప్రశ్నచక్రంలో ప్రశ్నదినపు తిధిని గాని గుర్తించాలి.ప్రతి తిధికి కొన్ని రాశులు దగ్ధ రాశులగును.దగ్ధ రాశులలో పడిన భావములు తమ కారకత్వాలను పోగొట్టుకొనును.అలాగే దగ్ధ రాశులలో ఉన్న గ్రహలు కూడ తమ కారకత్వాలను ఇవ్వజాలవు.
ఉదా;-జాతకచక్రంలో గాని ప్రశ్నచక్రం లో గాని జన్మతిధి లేక ప్రశ్నదినపు తిధి పాడ్యమి అనుకుంటే పాడ్యమి తిధికి దగ్ధరాశులు తులారాశి ,మకరరాసులు అవుతాయి.
జన్మలగ్నం గాని ప్రశ్నలగ్నం గాని మేష లగ్నం అయితే తులారాశి సప్తమ బావం,మకర రాశి దశమ బావ కారకత్వాలను ఇవ్వజాలవు,సప్తమ,దశమ బావాలలో ఉన్న గ్రహాలు కూడా తమ కారకత్వాలను ఇవ్వజాలవు.
సప్తమ బావ కారకత్వాలు:-వైవాహిక జీవితం,వ్యాపార బాగస్వామ్యం,సామాజిక సంబందాలు మొదలగు ముఖ్యమైన కారకత్వాలను దగ్ధరాశి కావటంవలన ఆయా కారకత్వాలను ఇవ్వజాలవు.
దశమ బావ కారకత్వాలు:-వృత్తి,కీర్తి ప్రతిష్ఠలు ,తండ్రి ద్వారా వచ్చే వారసత్వ సంపద మొదలగు ముఖ్యమైన కారకత్వాలను దగ్ధరాశి కావటంవలన ఆయా కారకత్వాలను ఇవ్వజాలవు.ఒక్కొక్కసారి జాతకచక్రంలో బావం,గ్రహం బలంగా ఉన్న పలితం రాకపోవటానికి కారణం దగ్ధరాశి ప్రభావం కూడ ఉంటుంది.
దగ్ధ రాశులలో ఉన్న గ్రహాలు కూడ తమ బావకారకత్వాలను ఇవ్వజాలవు.జాతకచక్రాన్ని పరిశీలించేటప్పుడు తప్పనిసరిగా దగ్ధరాశిని పరిశీలించకుండా పలిత విశ్లేషణ చేయరాదు.

Wednesday 27 November 2019

ద్విపుష్కర, త్రిపుష్కర యోగాలు

ద్విపుష్కర, త్రిపుష్కర యోగాలు
ధర్మం విధి నిషేధాత్మకం, కొన్ని సమయాల్లో కొన్ని పనులు చేయరాదు. కొన్ని సమయాల్లో కొన్ని పనులు చేస్తే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఉదాహరణకు త్రిపుష్కర, ద్విపుష్కర యోగాల్లో వస్తు లాభాలు, నష్టాలు, డబ్బు ఇవ్వడం, అప్పు తీర్చడం మొదలైనవి పునరావృతం అవుతూ ఉంటాయి. మన చేతిలో లేని నష్టాలు మొదలగువాని విషయం ఎలా ఉన్నా మనం చేసే పనుల్తో డబ్బు ఇవ్వడం, అప్పు తీర్చడం మొదలైనవి పునరావృతమైతే మరల మరల చేయాల్సి వస్తే కష్టం కదా! అందుకని ఆయా సమయాల్లో ఇవ్వవలసినవి గాని ఇష్టపూర్వకంగా ఇచ్చేవి ఇవ్వకుండా జాగ్రత్త పడవచ్చు.
ద్విపుష్కర యోగం: ఆది, మంగళ, శనివారాలు. విదియ, సప్తమి, ద్వాదశి తిథులు. ధనిష్ట, చిత్త, మృగశిర నక్షత్రాలు కలిసినపుడు ద్విపుష్కర యోగం. ఈ రోజుల్లో వస్తువు పోయినా, లభించినా ఆ క్రియలు మరల జరుగుతాయి.
త్రిపుష్కర యోగం: ఆది, మంగళ, శనివారాలు, విదియ, సప్తమి, ద్వాదశి తిథులు. విశాఖ, ఉత్తర, పూర్వాభాద్ర, పునర్వసు, కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలు కలిస్తే త్రిపుష్కరయోగం. ఈ రోజుల్లో మృతి, వస్తులాభాలు, నష్టాలు, డబ్బు ఇవ్వడం మొదలైనవి మూడుసార్లు పునరావృతమవుతాయి. కాబట్టి ఆ రోజుల్లో మరల మరల జరగరాదనుకునే పనులు చేయకుండా జాగ్రత్త పడాలి.ఈ యోగాలలో దానధర్మాలు చేయవచ్చు గానీ, లౌకిక కార్యాలలో డబ్బు ఇవ్వకపోవడం మంచిది. ఈ రోజులలో అప్పిస్తే తిరిగిరాదు సరికదా! మనమే మరల మరల ఇస్తుండాల్సి వస్తుంది. అత్యవసరం కానపుడు మందులు వాడకండి. వాడితే మళ్ళీ మళ్ళీ వాడాల్సి వస్తుంది. అదే విధంగా ఈ రోజుల్లో ఆపరేషన్లు చేయించకుండా ఉంటే మంచిది. మళ్ళీ మళ్ళీ చేయాలంటే ఇబ్బంది. మళ్ళీ మళ్ళీ చేయవచ్చు అనే పనులు చేయాలి. మళ్ళీ మళ్ళీ చేయాల్సి రావటం వలన ఇబ్బంది కలిగే పనులు చేయకండి. ఇలాగే అప్పు చేయడానికి సోమవారం మంచిది. త్రిపుష్కర, ద్విపుష్కర యోగాలు లేని మంగళవారం అప్పు తీర్చడానికి మంచిది. మంగళవారం అప్పు కొంతైనా తీరుస్తే అప్పుగా త్వరగా తీరుతుంది. బుధవారం అప్పు ఇవ్వడానికి గాని, తీసుకోవడం గాని లేదా దేనికైనా డబ్బు ఇవ్వడంగాని మంచిది కాదు.
అప్పు ఇస్తే తిరిగి వసూలు కావడానికి ఇబ్బంది కలిగే నక్షత్రాలు ఉత్తర, ఉత్తరాభాద్ర, ఉత్తరాషాఢ, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, విశాఖ, రోహిణి, కృత్తిక, మఖ, ఆర్ద్ర, భరణి, ఆశ్లేష, మూల, జ్యేష్ఠ, స్వాతి.

Tuesday 26 November 2019

పంచమస్ధానం :

పంచమస్ధానం

వ్యక్తి పూర్వ జన్మలో(పంచమ స్ధానం)చేసిన కర్మానుసారంగా తల్లి గర్భంలో (చతుర్ధభావం)పిండంగా తయారై (లగ్నం భావం) ద్వారా జన్మించి (దశమ భావం)ద్వారా కర్మ ఫలాలను అనుభవించి(నవమ భావం)ద్వారా పుణ్యబలం ఆధారంగా మోక్షానికి చేరతాడు.

పంచమస్ధానంలో పూర్వ పుణ్యబలం, మాత్రభావం,పుత్రభావం,ఆలోచన,తెలివితేటలు,పితృభావం, ఆద్యాత్మిక జ్ఞానం, త్రికోణభావం,విద్యయందు ఆసక్తి,తల్లికి అరిష్టం,సోదరుల విజయాలు (సహకారం),LOVE, మంత్రసిద్ధి,తీర్ధయాత్రలు దైవంపై నమ్మకాన్ని,నదీ స్నానాలు,దేవాలయాల ప్రతిష్ఠ,దేవతా ప్రతిష్ఠ,స్పెక్యులేషన్,ఉన్నత విద్య,బీజస్ధానం,ప్లానింగ్,ప్రణాళిక,భవిష్యత్ కార్యక్రమాలు తెలుసుకొనే స్ధానం,తండ్రి చేసిన పుణ్యం.పంచమస్ధానంను అనుసరించి మానవునికి అంతర్గత నైజమును గురించి తెలుసుకోవచ్చును.
పంచమాదిపతికి,పంచమానికి సంబందం ఉంటే జన్మ కాగానే మరొక జన్మలోకి అడుగు పెడతాడు.ప్రతి వ్యక్తి జాతకచక్రంలోను పంచమస్ధానం బాగుంటే మిగతా భావాలు అనుకూలంగా లేక పోయిన మంచి ఆలోచన,తెలివితేటలతోటి జీవితాన్ని భవిష్యత్ కార్యక్రమాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోగలడు.

అగ్నితత్వరాసులు(మేష,సింహ,దనస్సు రాశులు) పంచమస్ధానం అయితే ఏదైనా సాదించాలనే పట్టుదల,చురుకుదనం,ఇతరులు తనని గౌరవించాలనుకోవటం,రాజకీయాలలో రాణింపు.పొగిడితే లొంగిపోయే గుణం,స్వతంత్ర ఆలోచన చేయగలరు.దుష్ప్రవర్తన కలిగి ఉంటారు.ఉద్రేక స్వభావం,దైర్యం,సాహసం కలిగి ఉంటారు.భవిష్యత్ పై ముందు చూపు కలిగి ఉంటారు.
భూతత్వరాశులు(వృషభ,కన్య,మకర రాశులు) పంచమస్ధానం అయితే మెమరీపవర్ బాగుంటుంది,ఏ విషయాన్ని అయిన సరే సూక్ష్మంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.ఊహాత్మకంగా ఉంటారు.తీవ్రమైన భావోద్వేగాలు ఉంటాయి.ప్రతి విషయంలో నిర్లక్ష్యం.గతించిన విషయాలను గురించి ఆలోచిస్తారు.సహనాన్ని కోల్పోవటం.ధనం విషయంలో గుట్టుగా ఉండటం,ఈర్ష్య మొదలైన లక్షణాలు కలిగి ఉంటారు.
వాయుతత్వరాసులు(మిధున,తుల,కుంభ రాశులు) పంచమస్ధానం అయితే ప్రతి చిన్న విషయానికి భాద పడటం,భయపడటం,అలగటం,తొందరగా నిర్ణయాలు తీసుకోలేరు.ఎమోషన్స్ ఎక్కువ.అనవసర విషయాలను పట్టించుకోవటం.సాంప్రదాయాలు,ఉన్నత విలువలకు ప్రాధాన్యత ఇస్తారు.
జలతత్వరాసులు(కర్కాటక,వృశ్చిక,మీన రాశులు) పంచమస్ధానం అయితే మానసిక స్ధిరత్వం,ఊహాశక్తి,మంచి ఆలోచన,చంచలత్వం,అంతర్గత ఆలోచనలు,ప్రతి విషయంలోనూ సీక్రెట్ గా ఉంటారు.ఇతరులలో తప్పులు వెతుకుతుంటారు.విమర్శించే నైజం కలిగి ఉంటారు.విశ్రాంతి లేకుండా పని చేస్తారు.కనపడే శైలికి భిన్నంగా నడుచుకుంటారు.

Monday 25 November 2019

ఆదిత్య హృదయం

ఆదిత్య హృదయం :
ఆదిత్య హృదయం అనే ఈ స్తోతము సూర్యభగవానుడి ని ఉద్దేశించినది. రామాయణం యుద్ధకాండలో శ్రీ రాముడు అలసట పొందినప్పుడు, అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి ఆదిత్య హృదయం అనే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు.ఈ ఉపదేశము అయిన తరువాత శ్రీరాముడు రావణాసురుడిని హతుడిని చేస్తాడు. వాల్మీకి రామాయణం లోని యుద్ధకాండమునందు 107 సర్గలో ఈ అదిత్య హృదయ శ్లోకాలు వస్తాయి.
1. తతో యుద్ద పరిశ్రాంతం సమరే చింతయా స్థితం |
రావణంచాగ్రతో దృష్వా – యుద్దాయ సముపస్థితమ్‌ ||
అర్థము : యుద్ధము చేసి చేసి మిక్కిలి అలసియున్న శ్రీరాముడు సమరరంగమున చింతా క్రాంతుడైయుండెను. పిమ్మట రావణుడు యుద్ధసన్నద్ధుడై ఆ స్వామి యెదుట నిలిచి యుండెను.
2. దైవతైశ్చ సమాగమ్య – ద్రుష్టు మభాగ్యతో రణం |
అర్థము : ఉపగమ్యాబ్రవీ ద్రామ – మగస్త్యో భగవాన్‌ ఋషి: ||
యుద్ధమును చూచుటకై దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి, ఆ ప్రభువుతో ఇట్లు పల్కెను.
3. రామ రామ మహాబాహో – శృణుగుహ్యం సనాతనం |
యేనసర్వా నరీ న్వత్స – సమరే విజయిష్యసి ||
అర్థము : ఓరామా! మహాబాహో! నాయనా! సనాతనము మిగుల గోప్యము ఐన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయము సాధించగలవు.
4. ఆదిత్యహృదయంపుణ్యం – సర్వశత్రువినాశనం |
జయావహం జపేన్నిత్యం – మక్షయ్యం పరమం శుభమ్‌ ||
అర్థము : ఈ ఆదిత్యహృదయ అను స్తోత్రము పరమ పవిత్రమైనది. సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్ర జయములభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయముగ ప్రసాదించునది.
5. సర్వ మఙ్గలమాఙ్గల్యం – సర్వపాపప్రణాశనం |
చిన్తాశోకప్రశమన – మాయుర్వర్ధన ముత్తమమ్‌ ||
అర్థము : ఇది పరమపావనమైనది. సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపజేయును ఆధివ్యాధులను తొలగించి ఆయుస్సును వృద్ధిపరుచును. సర్వ జపములలో శ్రేష్ఠమైనది. కావున దీనిని జపించుట ఎంతేని ఆవశ్యము.
6. రశ్మిమన్తం సముద్యన్తం – దేవాసురనమస్కృతం |
పూజయస్వ వివస్వన్తం – భాష్కరం భువనేశ్వరమ్‌ ||
అర్థము : అనంతమైన బంగారుకిరణములతో శోభిల్లుచు, జాతికి జాగృతి కూర్చును. దేవాసురులు ఈయనకు ప్రణమిల్లుదురు. మిక్కిలి తేజస్సుగలవాడు, సమస్త భువనములన నియంత్రించువాడు, లోకములకు వెలుగునిచ్చు ఆదిత్యుని పూజింపుము.
7. సర్వదేవాత్మకో హ్యేష – తేషస్వీ రశ్మిభావన: |
ఏష దేవాసురగణాన్‌ -లోకా న్పాతి గభ స్తిభి: ||
అర్థము : ఇతడు సమస్త దేవతలకు ఆత్మయైనవాడు. తేజో రాశి. తన కిరణములచే లోకమునకు శక్తిని, స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసుర గణములతో గూడి సమస్త లోకములను తన కిరణములచే రక్షించుచుండువాడు.
8. ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ – శివ స్స్కన్ధ: ప్రజాపతి: |
మహేన్ద్రో ధనద: కాలో – యజు స్సోమో హ్యపాంపతి: ||
అర్థము : బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు, కాలస్వరూపుడు, యముడు, చంద్రుడు, వరుణుడు మరియు
9. పితరో వసస్సాధ్యా – హశ్శినౌ మరుతో మను: |
వాయు ర్వహ్ని: ప్రజా: ప్రాణా – ఋతుకర్తా ప్రభాకర: ||
అర్థము : పితృదేవతలు. వసువులు, సాధ్యులు. అశ్వినీదేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలగువారి స్వరూపములు అన్నిము ఇతనివే. షడృతువులకు కారకుడు ఈ ప్రభాకరుడే.
10 ఆదిత్య స్సవితా సూర్య: – ఖగ: పూషా గభస్తిమాన్‌ |
సువర్ణసదృశో భాను: – స్వర్ణరేతా దివాకర: ||
అర్థము : ఆదిత్యుడు జగత్‌సృష్టికి కారకుడు. జనులు తమవిధులు నిర్వర్తించుటకు ప్రేరణయిచ్చును. లోకోపకారం కొరకు ఆకాశమున సంచరించి వర్షములద్వారా జగత్తును పోషించి తన కిరణములను ప్రకాశింపజేయును. బంగారు వన్నెతో తేజరిల్లుచు అద్భుతముగా ప్రకాశించువాడు. బ్రహ్మాండములు ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగించుచు దివాసమయమున ప్రాణులను కార్యనిమగ్నులను గావించువాడు.
11. హరిదశ్వ స్సహస్రార్చి – స్సప్తసప్తి ర్మరీచిమాన్‌ |
తిమిరోన్మథన శ్శంభు – స్త్వష్టా మార్తాణ్డ అంశుమాన్‌ ||
అర్థము : శ్యామవర్ణముగల రథాశ్వములు గలవాడు. అసం ఖ్యాకములైన కిరణములు గలవాడు. సప్త అను పేరుగల రథాశ్వముగలవాడు. రథమునకు ఏడు గుఱ్ఱములుగలవాడు. తేజో నిధానములైన కిరణములు గలవాడు. సర్వసంహారకుడు. జగత్ప్రళయమునకు పిమ్మట దానిని మరల సృజించుటకై ఆవిర్భవించెడివాడు. నిరంతరము తన కిరణములచే ప్రకాశించుచుండువాడు.
12. హిరణ్య గర్భ శ్శిశిర – స్తపనో భాస్కరో రవి: |
అగ్ని గర్భో దితే:పుత్ర – శ్శంఖ శ్శిశిరనాశన: ||
అర్థము : బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు. తాపత్రయములతో బాధపడువారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు శాంతిని ప్రసాదించువాడు, తపింపజేయువాడు. దివ్యములైన వెలుగులను గూర్చువాడు. సకల లోకములకు స్తుతిపాత్రుడు. దివాసమయమున అగ్నిని గర్భమునందు ధరించువాడు. అదితి దేవికి పుత్రుడుగా అవతరించినవాడు. సాయంకాలమున స్వయముగా శాంతించువాడు. మంచును తొలగించువాడు.
13. వ్యోమనాథ స్తమోభేదీ – ఋగ్యజుస్సామపారగ: |
ఘనవృష్ఠి రపాంమిత్రో – విన్ద్యవీథీప్లవఙ్గమ: ||
అర్థము : ఆకాశమునకు అధిపతియైనవాడు. రాహువును ఛేదించు లక్షణముగలవాడు. పూర్వాహ్ణమున ఋగ్వేదరూపము, మధ్యాహ్న సమయమున యజుర్వేదరూపమును, సాయంసమయమున సామవేదరూపమునను అలరారుచుండెడివాడు. ఘనముగా వర్షములను కురిపించుచుండువాడు. అందువలననే జలములను వర్షింపజేయువాడు అని ఖ్యాతి వహించెను. వింధ్యగిరి మార్గమున అతివేగముగా సంచరించువాడు.
14. ఆతపీ మణ్డలీ మృత్యు: – పింగల స్సర్వతాపన: |
కవిర్విశ్వోమహాతేజా – రక్త స్సర్వభవోద్భవ: ||
అర్థము : వేడిని కలిగియుండువాడు. వృత్తాకారమైన బింబము గలవాడు. విరోధులను రూపుమాపువాడు. ప్రభాత సమయమున పింగళవర్ణము కలిగియుండువాడు. మధ్యాహ్న సమయమున సర్వప్రాణులను తపింపజేయువాడు. వ్యాకరణాది సమస్త శాస్త్రముల యందును పండితుడు. విశ్వమును నిర్వహించువాడు. గొప్ప తేజస్సు గలవాడు. సకల ప్రాణులయందును అనురక్తి గలిగి యుండువాడు. సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు.
15. నక్షత్రగ్రహతారాణా – మధిపో విశ్వభావన: |
తేజసా మపితేజస్వీ – ద్వాదశాత్మ న్నమోస్తుతే ||
అర్థము : నక్షత్రములకు, గ్రహములకు, తారలకును అధిపతియైనవాడు. విశ్వస్థితికి హేతువు. అగ్న్యాది తేజస్సులకు మించిన తేజస్సు గలవాడు. పన్నెండు రూపములతో విలసిల్లువాడు. ఈ నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారం.
16. నమ: పూర్వాయ గిరయే – పశ్చిమే గిరయే నమ: |
జ్యోతిర్గణానాం పతయే – దినాధిపతయే నమ: ||
అర్థము : స్వామీ! నీవు పూర్వగిరియందును, పశ్చిమగిరి యందును విలసిల్లుచుండువాడు. గ్రహములకు, నక్షత్రములకు, దివారాత్రములకు అధిపతివి. ఉపాసకులకు జయము అనుగ్రహించునట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.
17. జయాయ జయభద్రాయ – హర్యశ్వాయ నమో నమ: |
నమో నమ స్సహస్రాంశో – ఆదిత్యాయ నమో నమ: ||
అర్థము : జయములను, శుభములను చేకూర్చువాడవు. శ్యామవర్ణముగల రథాశ్వములుగలవాడవు. వేలకొలది కిరణములు గలవాడవు. అదితి పుత్రుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.
18. నమ ఉగ్రాయ వీరాయ – సారఙ్గాయ నమో నమ: |
నమ: పద్మప్రబోధాయ – మార్తాణ్డాయ నమో నమ: ||
అర్థము : నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు. ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు. శీఘ్రముగ ప్రయాణించువాడవు. పద్మములను వికసింపజేయువాడవు. జగత్ప్రళయమునకు పిమ్మట మరల సృజించుటకై ఆవిర్భవించు నట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.
19. బ్రహ్మేశానాచ్యుతేశాయ – సూర్యా యాదిత్యవర్చసే |
భాస్వతే సర్వభక్షాయ – రౌద్రాయ వపుషే నమ: ||
అర్థము : బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకవు. దివ్య తేజస్సంపన్నుడవు. కాంతికి నిధియైన వాడవు. ప్రళయకాలమున లయకారకుడవు. అందువలన రుద్రస్వరూపుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.
20. తమోఘ్నాయ హిమఘ్నాయ – శత్రుఘ్నా యామితాత్మనే |
కృతఘ్నఘ్నాయ దేవాయ – జ్యోతిషాం పతయే నమ: ||
అర్థము : తమస్సును రూపుమాపువాడవు. జడత్వమును, శీతలత్వమును నశింపజేయువాడవు. నిన్ను ఆశ్రయించి నవారి శత్రువులను సంహరించువాడవు. పరమాత్మ స్వరూపుడవు. కృతఘ్నులను నశింపజేయుచు, దివ్యతేజస్సు విరజిమ్ముచు, జ్యోతులకు అధిపతివైన నీకు నమస్కారము.
21. తప్తచామీకరాభాయ – వహ్నయే విశ్వకర్మాణే |
నమస్తమోభినిఘ్నాయ – రుచయే లోకసాక్షిణే ||
అర్థము : బంగారమువంటి వన్నెగలవాడవు. ఆహుతులను గ్రహించువాడవు. సర్వజగత్కర్తవు. తమస్సులను పారద్రోలువాడవు. ప్రకాశస్వరూపుడవు. జగత్తున జరిగెడి సర్వజనుల కర్మలకు సాక్షియైన వాడవు. కనుక ఓ భాస్కరుడా నీకు నమస్కారము.
22. నాశయ త్యేష వైభూతం – త దేవ సృజతిప్రభు: |
పాయత్యేష తపత్యేష – వర్స త్యేష గభస్తిభి: ||
అర్థము : రఘునందనా! ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమొనర్చును. పిదప సృష్టించి పాలించుచుండును. ఇతడు తన కిరణముల చేత జగత్తును తపింపజేయును. వర్షములను ప్రాసాదించుచుండును.
23. ఏష సుప్తేషు జాగర్తి – భూతేషు పరినిష్ఠిత: |
ఏష చైవాగ్నిహోత్రఞ్ఛ – ఫలంచై వాగ్ని హోత్రిణామ్‌. ||
అర్థము : ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా నుండును. వారు నిద్రించుచున్నను తాను మేల్కొనియే యుండును. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే. తత్ఫలస్వరూపమూ ఇతడే.
24. వేదాశ్చక్రతవశ్చైవ – క్రతూనాం ఫల మేవ చ |
యాని కృత్యానిలోకేషు – స ర్వ ఏషరవి: ప్రభు: ||
అర్థము : ఇతడు వేదవేద్యుడు. యజ్ఞఫలస్వరూపుడు. లోకములో జరిగెడి సమస్త కార్యములకు ఈ సూర్యభగవానుడే ప్రభువు.
25. ఏనమాపత్సుకృచ్ఛ్రేషు – కాన్తారేషు భయేషు చ |
కీర్తయ న్పురుష: కశ్చి – న్నావసీదతి రాఘవ ||
అర్థము : రఘురామా! ఆపదలయందును, కష్టముల యందును, దుర్గమమార్గములయందును, భయస్థితులయందును ఈ స్వామిని కీర్తించినవారికి నాశము ఉండదు.
26. పూజాయ స్వైన మేకాగ్రో – దేవదేవం జగత్పతిత్‌ |
ఏత త్త్రిగుణితం జప్త్వా- యుద్దేషు విజయిష్యసి ||
అర్థము : దేవదేవుడు, జగత్పతియైన ఈ సూర్యభగవానుని ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్యహృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహా సంగ్రామము నందు విజయము పొందగలవు.
27. అస్మిన్‌ క్షణే మహాబాహో – రావణం త్వం వధిష్యసి |
ఏవముక్త్వాతదా గస్త్యో – జగామ చ యథాగతమ్‌ ||
అర్థము : మహాబాహో! రామా! ఈ క్షణముననే నీవు రావణుని వధింపగలవు అని పలిగి అగస్త్య మహర్షి తన స్థానమునకు చేరెను.
28. ఏత చ్ఛ్రుత్వా మహాతేజా – నష్టోశోకో భవ త్తదా |
ధారయామాస సుప్రీతో – రాఘవ: ప్రయతాత్మవాన్‌ ||
అర్థము : మహాతేజస్వియైన శ్రీరాముడు అగస్త్యమహాముని ద్వారా ఈ ఆదిత్యహృదయ మహిమను గ్రహించి చింతారహితుడయ్యెను. అతడు మిక్కలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఆదిత్యహృదయ మంత్రమును మనస్సు నందు నిలుపుకొనెను.
29. ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు – పరంహర్ష మవాప్తవాన్‌ |
త్రిరాచమ్య శుచిర్భూత్వా – ధను రాదాయ వీర్యావాన్‌ ||
అర్థము : పిదమ ముమ్మారు ఆచమించి శుచియై సూర్యభగవానుని జూచుచు ఈ మంత్రమును జపించి పరమ సంతుష్టుడాయెను. పిమ్మట ఆ రఘువీరుడు తన ధనువును చేబూనెను.
30. రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్దాయ సముపాగమత్‌ |
సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోభవత్‌ ||
అర్థము : మిక్కిలి సంతుష్టుడైయున్న ఆ రాముడు రావణుని జూచి యుద్ధమునకై పురోగమించెను. అన్ని విధములుగా గట్టి పూనికతో ఆ నిశాచరుని వధించుటకు కృతనిశ్చయుడయ్యెను.
31. ఆథ రవి రవద న్నిరీక్ష్య రామం ముదితమానా: పరమం ప్రహృష్యమాణ: |
నిశచరపతి సంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచ స్త్వరేతి ||
అర్థము : పిమ్మట దేవతలమధ్యనున్న సూర్యభగవానుడు రావణుడు నశించుట తథ్యము అని ఎరింగి మానసోల్లాసమును పొందినవాడై, పరమ సంతోషముతో శ్రీరాముని జూచి రామా! త్వరపడుము అని పలికెను.

గ్రహములు - వీక్షణములు :



గ్రహములు - వీక్షణములు .
అన్ని గ్రహములు తామున్న స్థానము నుండి 7 వ రాశిని అందులోని గ్రహములను చూస్తాయి.
1) రవి : తానున్న స్థానము నుండి 7 వ రాశిని అందులోని గ్రహాలను వీక్షించును.
2) చంద్రుడు : తానున్న స్థానము నుండి 7 వ రాశిని అందులోని గ్రహాలను వీక్షించును..
3) కుజుడు : తానున్న స్థానము నుండి 4,7,8 రాశులను అందులోని గ్రహాలను వీక్షించును.
4) రాహువు : తానున్న స్థానము నుండి 7 వ రాశిని అందులోని గ్రహాలను వీక్షించును.
5) గురువు : తానున్న స్థానము నుండి 5,7,9 స్థానములను అందులోని గ్రహాలను వీక్షించును.
2) శని : తానున్న స్థానము నుండి 3,7,10 స్థానములను అందులోని గ్రహాలను వీక్షించును.
2) బుధుడు : తానున్న స్థానము నుండి 7 వ రాశిని అందులోని గ్రహాలను వీక్షించును.
2) కేతువు : తానున్న స్థానము నుండి 7 వ రాశిని అందులోని గ్రహాలను వీక్షించును.
2) శుక్రుడు : తానున్న స్థానము నుండి 7 వ రాశిని అందులోని గ్రహాలను వీక్షించును.

అన్ని గ్రహములు తామున్న స్థానం నుండి 7వ స్థానం ను చూస్తాయి. శని తానున్న రాశి నుండి 3,10 స్థానములను , కుజుడు తానున్న రాశి నుండి 4,8 స్థానములను , గురుడు తానున్న రాశి నుండి 5,9 స్థానములను కూడా చూస్తాయి.
పాద దృష్టి : 3,10 స్థానములను చూచు దృష్టిని పాద దృష్టి అంటారు. పాద దృష్టిలో శని .బలవంతుడు.
అర్ధ దృష్టి : 5,9 స్థానములను చూచు దృష్టిని అర్ధ దృష్టి అంటారు. అర్ధ దృష్టిలో గురుడు .బలవంతుడు.
త్రిపాద దృష్టి : 4,8 స్థానములను చూచు దృష్టిని త్రిపాద దృష్టి అంటారు. త్రిపాద దృష్టిలో కుజుడు బలవంతుడు.
పరిపూర్ణ దృష్టి : 7 వ స్థానమును చూచు దృష్టిని పరిపూర్ణ దృష్టి అంటారు. పరిపూర్ణ దృష్టిలో అన్ని గహములు బలవంతులే.
పరిశీలించదగిన మరి కొన్ని దృష్టులు :

1.సమాగమ దృష్టి : రెండు గ్రహములు ఒకే డిగ్రీలో లేదా 7 డిగ్రీల తేడాతో ఉంటే సమాగమ దృష్టి ఏర్పడుతుంది.
రెండు శుభ గ్రహముల మధ్య సమాగమ దృష్టి శుభము నిచ్చును. రెండు పాప గ్రహముల మధ్య ఈ దృష్టి అశుభము నిచ్చును.
2.అర్ధ కోణ దృష్టి : రెండు గ్రహముల మధ్య 60 డిగ్రీల దూరముంటే అర్ధకోన దృష్టి ఏర్పడుతుంది. 55 డిగ్రీల నుండి 65డిగ్రీల దూరము వరకు ఈ దృష్టిని పరిగణింతురు.
ఏ రెండు గ్రహముల మధ్యనయినా అర్ధకోణదృష్టి శుభము నిచ్చును.
3.కేంద్ర దృష్టి : రెండు గ్రహముల మధ్య 90 డిగ్రల దూరముంటే కేంద్ర దృష్టి ఏర్పడుతుంది. 85 డిగ్రీల నుండి 95 డిగ్రీల దూరము వరకు ఈ దృష్టిని పరిగణింతురు.
శుభ గ్రహముల మధ్య ఈ దృష్టి శుభ ఫలితాలను యిస్తుంది.
4.కోణ దృష్టి : రెండు గ్రహముల మధ్య 120 డిగ్రీల దూరముంటే కోణ దృష్టి ఏర్పడుతుంది. 115 డిగ్రీల నుండి 125 డిగ్రీల వరకు ఈ దృష్టి ఏర్పడుతుంది.
ఏ రెండు గ్రహముల మధ్యనైనా ఈ దృష్టి శుభము నిస్తుంది.
5.సమసప్తక దృష్టి : రెండు గ్రహముల మధ్య 180 డిగ్రీల దూరముంటే సమసప్తక దృష్టి ఏర్పడుతుంది. 175 డిగ్రీల నుండి 185 డిగ్రీల వరకు ఈ దృష్టి ఏర్పడుతుంది.
రెండు శుభ గ్రహముల మధ్య సమసప్తక దృష్టి శుభము నిస్తుంది.
6.సమాంతర దృష్టి :రెండు గ్రహములు ఉత్తర,దక్షిణములలో ఒకే డిగ్రీలో ఉంటే సమాంతర దృష్టి ఏర్పడుతుంది.
రెండు శుభ గ్రహముల మధ్య సమాంతర దృష్టి శుభము నిస్తుంది. రెండు పాప గ్రహముల మధ్య ఈ దృష్టి అశుభము నిస్తుంది.

                                https://youtube.com/shorts/hXs7ylVV_Rs?si=eAVlfsOGtiuuLmaF