Friday, 6 September 2019

గజకేసరీ యోగం
గజము అంటే ఏనుగు. కేసరీ అంటే సింహం. యోగం అంటే కలయిక. ఏనుగు సింహములు కలిసి ఉండటం అంటే జరిగే పని కాదు.
కలిసినప్పుడు యుద్ధం తప్పదు. కానీ ఏనుగు సింహములను ఒకచోట వుంచి సమాధానపరచగలిగిన స్థాయి సమన్వయకర్తగా ఈ యోగ జాతకులు ఉంటారు అని ఈ పేరు యోగమునకు పెట్టారేమో అని అనిపిస్తోంది. అయితే ‘గజకేసరీ సంజాతస్తేజస్వీ ధనవాన్ భవేత్ మేధావీ గుణసంపన్నో రాజాప్రియకరో నరః’ అని ఫలితం చెప్పారు.
గజకేసరీ యోగంలో పుట్టిన వారు మంచి తేజస్సు కలవారు, ధనవంతులు, మేధావులు, సుగుణములు కలవారు. అసలు గజకేసరీ యోగం వున్నదా? లేదా? ఎలా తెలుసుకోవాలి.
దేవగురౌ లగ్నాచ్చంద్రా ద్వా-శుభ మృగ్యుతే - నీచాస్తారి గృహైర్హేనే యోగోయం గజకేసరీ’ జన్మలగ్నము నుండి కానీ చంద్రుడు వున్న రాశి నుండి కానీ గురువు 1,4,7,10 స్థానములలో వున్నప్పుడు ఆ గురువుకు ఆ స్థితిలో నీచ దోషం, అస్తమయ దోషం, శత్ర క్షేత్ర దోషం వంటివి లేనప్పుడు శుభదృగ్యోగములు వున్నప్పుడు గజకేసరీ యోగం కలుగును.
మకరం, వృషభం, తులా రాశులు గురువుకు నీచ శత్రు క్షేత్రములు ఆ రాశులలో గురువు వున్నప్పుడు గజకేసరీ యోగం వర్తింపదు అని గుర్తించాలి. ‘శుభగ్రహ వీక్షణ’ అనే విషయంలో శుక్ర బుధులకు శత్రుత్వం వున్నది కావున ఇక్కడ పరాశరుల వారి ఉద్దేశం ఆధిపత్యరీత్యా శుభ గ్రహములు అని నా భావన.
శత్రు క్షేత్రంలో వుంటే రాజయోగం లేదు అని అన్నప్పుడు శత్రు గ్రహం అయిన నైసర్గిక శుభులు శుక్రుడు బుధుడు కాదు అనవచ్చు. ఆధిపత్య శుభులు అంటే కోణాధిపతులు, మరియు కేంద్రాధిపత్యం వచ్చిన పాప గ్రహములు అనుకోవచ్చు.
‘జాతక పారిజాతం’లో కేంద్ర స్థితే దేవగురౌ మృగాంకాద్యోగస్తదా హుర్గజకేసరీ ణి -దృష్టే సితార్యేందుసుతైః శశాంకే నీచాస్త హీనైర్గజకేసరీస్యాత్. చంద్రునకు కేంద్రమందు గురువు వున్నచో గజకేసరీ యోగము మరియు చంద్రుడు నీచాస్త దోషములు లేని సితి- శుక్రుడు, ఆర్య - బృహస్పతి - ఇందుసుతైః - బుధ గ్రహములచే చూడబడినను గజకేసరీ యోగము అని భావము. అని నైసర్గిక శుభులు కూడా పరిధిలోకి తీసుకొని వివరించారు.
ఈ ప్రకారం ఆధిపత్య శుభ గ్రహములతో సంబంధం లేకుండా నైసర్గిక శుభగ్రహాలు పరిధిలోకి తీసుకొని ఈ రాజయోగం చెప్పబడినది. దీని ప్రభావం ఎప్పుడు మనకు గోచరిస్తోంది అంటే జన్మతః ఎప్పుడూ సంఘంలో విశేష గౌరవములతోనే వుండే అవకాశం గజకేసరీ యోగం కలిగిస్తుంది. అయితే చంద్ర, గురు అంతర్దశల కాలాలు శుభగ్రహాలు ఏవయితే గురువుతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటాయో ఆ సమయంలో విశేషంగా ధన లాభం, కీర్తి లాభం, వంటివి కలుగుతాయి. అంతేకాకుండా ఫలదీపిక ‘శశిని సురగురోః కేంద్రగే కేసరీతి’ అని చెప్పిన కారణంగా శుభగ్రహానుబంధం వున్ననూ లేకున్ననూ గజకేసరీ యోగము అనే చెప్పాలి.
గురువు మిత్ర క్షేత్రంలో కంటే స్వక్షేత్రంలో వుండగా స్వక్షేత్రం కంటే ఉచ్ఛ క్షేత్రంలో వుండగా ఈ రాజయోగ ప్రభావం ఎక్కువగా ఉండి సంఘంలోనూ అధిక గౌరవ మర్యాదలు పొందుతారు. అయితే ఈ రాజయోగములు భావచక్రం ద్వారా చూడవలెననియు రాశి చక్రంలో వున్న గ్రహముల ద్వారా కంటే భావచక్రంలో రాజయోగములు గుర్తించి ఫలితాంశములు చెప్పటం వలన నిర్దుష్టముగా మంచి ఫలితాలు రాగలవు అని మహర్షుల వాదన అందువలన భావచక్రం ద్వారా ఈ జాతక యోగములు పరిశీలింపగలరు.

No comments:

Post a Comment

                                       https://youtube.com/shorts/pQCfIouCjIE?si=3Fg2-0hTfiR8Kwq1