Tuesday 14 January 2020

పంచమ భావము - ఫలితములు :

1) జన్మ లగ్నము నుండి ఐదవ రాశియే పంచమ భావము. దీనిని "పుత్ర భావము , మంత్ర స్థానము , లక్ష్మీ స్థానము , మనః స్థానము " అనియు అందురు.
2) ఈ పంచమ భావము ద్వారా జాతకుని యొక్క "బుద్ధి , వివేకము , పుత్ర సంతతి , జ్ణాపక శక్తి , సంతోషము , మాట నేర్పు , కళల అభినివేశము , లలిత కళలు , గ్రంధ రచనా శక్తి , వ్యూహ నిర్మాణము , మంత్రి పదవి , మంత్ర ఉపాసనలు , దేవతా ప్రసన్నము , ఆటలు , వ్యాపారము , వ్రాత యందు నేర్పు , భవిష్యత్ జన్మకు సంబంధించిన విషయములు , మెదడు , పొట్ట , గర్భ స్రావము , దాన విషయములు , పితృ భాగ్యము " అను విషయములను తెలిసికోవలెను.
3) పంచమ భావమునకు గురువు కారక గ్రహము, ఇందు మనః బుద్ధికి సంబంధించిన విషయములకు చంద్రుని , సంతోష అధికారాది విషయములకు శుక్రుని కారక గ్రహముగా గ్రహింపవలెను.
4) పంచమ భావము నందు శుభ గ్రహములు ఉండి వీటికి గురు దృష్టి కలిగి , పంచమాధిపతి శుభ స్థానముల యందు శుభ గ్రహ సంబంధాధికుడై యుండుట వలన భావ ఫలితములు వృద్ధి కరముగా నుండగలవు.
5) పంచమ భావాధిపతికి పాప సంబంధము , పాప స్థితి , భావమున పాప గ్రహములుండుట , గురువు పాప సంబంధాధిక్యత నందుట వలన భావ ఫలితము లన్నియు చెడిపోగలవు.
6) పంచమ భావము నందు రవి యున్న కుశాగ్ర బుద్ధి ,, మంత్రి , విద్యా పరిజ్ణానములు , మోసములు , అధిక కోపము , స్వల్ప భోగము , ఏక పుత్ర సంతానము , అట్టి సంతానము వలన బాధలు , బాల్య దశ యందు దుఃఖము , యౌవన దశ యందు కష్టములు , భుజ రోగములచే మృతియు కలుగును.
7) చంద్రుడు పూర్ణ కళలను కలిగి , పంచమము నందు ఉన్న విశేష ధన సుఖ భోగములు , స్త్రీ సంతానాధిక్యత ,పుత్ర ప్రాప్తి , మాతృ నష్టము , కలుగ గలదు . క్షీణ చంద్రుడు ఉన్న కుటుంబ సౌఖ్యము , స్వల్ప భోగము , స్త్రీ సంతతి , చంచల స్వభావములుండును.
8) పంచమ భావమునందు కుజుడు యున్న పుత్ర హీనత , ధన లోపము , దుఃఖము , కఠిన హృదయము , నేర్పు కలిగిన వ్యాపారము ప్రాప్తించును.
.....సశేషం.....

No comments:

Post a Comment

                         https://youtube.com/shorts/flB4WlmnbLs?si=SMNTDWimlM9c0PJd