Friday 17 January 2020

పంచమ భావము - మంత్ర , దేవతా ఉపాసనా యోగములు :

42) పంచమ భావమునకు బలయుక్తమగు పురుష గ్రహ సంబంధము వలన పురుష దేవతోపాసనము , బలము . గల స్త్రీ గ్రహ సంబంధము వలన స్త్రీ దేవతోపాసనము ప్రాప్తింప గలవు.
43) అంశ చక్రము నందు 5-9 స్థానములలో పాప గ్రహములుండి , శుభ గ్రహ దృష్టి నందిన యొడల తాను ఉపాసించు దేవత యొక్క పూర్ణ అనుగ్రహము లభించును.
44) పంచమ భావము నందు బలయుక్తులైన ఆయా గ్రహములకు స్థితి కలిగిన ఈ దేలుపబోవు విధముగా దైవ మంత్రోపాసనలు ప్రాప్తింపగలవు. రవి వలన శైవోపాసన , చంద్రుని వలన గౌరి - పార్వతి , యక్షిణి దేవతలు , కుజుని వలన కుమార స్వామి , వీరభద్రుడు , భైరవుడు , బుధుని వలన సరస్వతీ దేవి , హయగ్రీవుడు(విద్యాధిదేవత) , దక్షిణా మూర్తి , గురువు వలన విష్ణు దేవుడు (విష్ణుమూర్తి అవతార విశేషములు) ,శుక్రుని వలన చాముండ - దుర్గ , శని వలన క్షుద్ర దేవతలు ,రాహువు కేతువు వలన పర పీడాకర శక్తులకు ఉపాసింప గలరు.
45) ఉగ్రమగు పురుష దేవతోపాసనలు ప్రాప్తించుటకు రవి,కుజ,గురుల కలయిక , ఉగ్ర స్త్రీ దేవతోపాసనలకు శని,కుజ,శుక్రుల కలయిక పంచమములో నుండవలెను.
46) అంశ లగ్నమై యున్న రాశి నుండి రాశి చక్రము నందు 5-9 స్థానములలో రెండు పాప గ్రహములున్ననూ ఆ కోణస్థానములకు పాప గ్రహ వీక్షణలు సోకిననూ భూత పిశాచాది పీడాకర గ్రహములను వశము గావించుకొని , భూత మాంత్రికుడు కాగలడు.
47) మంత్ర కారక గ్రహము 1-4-5-7-9-10 స్థానముల యందు శుభ గ్రహ నవాంశల యందుండి , బుధ - శుక్రుల దృగ్యోగాది సంబంధములను కలిగి యున్న తన ఉపాసనా బలము వలన జరగ బోవు అన్ని విషయములను తెలుపగల సమర్ధుడు కాగలడు.
48) కేంద్ర స్థానముల యందు చంద్రుడు బలమును కలిగి , శుభ గ్రహ దృష్టి నంది యుండగా , పంచమాధిపతి ఉచ్చ - మిత్ర క్షేత్రముల యందు శుభ గ్రహ సంబంధీకుడై యున్న యొడల త్రికాల వేత్త కాగలడు.
49) అంశ చక్రమునందు శుక్ర కేతువులు ఒకరినొకరు చూచుకొనుచూ యున్న యాజ్ణీకత్వము ప్రాప్తింప గలదు.
50) చంద్ర శనులు కలసి పంచమ స్థానము నందు బలవంతుడై యుండిన గొప్ప మేధావులై , దైవ రహస్యముల . నెరుంగు శక్తి గల వారగుదురు.
51) పంచమాధిపతి - నీచను పొంది , మంత్ర కారక గ్రహము - శత్రు క్షేత్రము నందుండి , నవమ స్థానము నందు .నైసర్గిక పాప గ్రహములున్న తన మంత్ర శక్తితో పరులను హింసింప గలడు.
52) పంచమ - నవమముల యందు 6-8-12 స్థానాధిపతులుండి , మంత్ర కారక - లగ్నాధిపతులు కలసి 8వ స్థానము నందు ఉన్న పరకీయ మంత్ర శక్తితో ప్రాణములను కోల్పోవును.

No comments:

Post a Comment

                         https://youtube.com/shorts/flB4WlmnbLs?si=SMNTDWimlM9c0PJd