Thursday 23 January 2020

గ్రహాలకు మిత్ర, శతృ, సమత్వాల పరిశీలన :

శుభ్ర గ్రహములు : గురువు, శుక్రుడు , పూర్ణ చంద్రుడు, బుధుడు(శుభులతో
కలసిన శుభుడు)
పాప గ్రహములు: రవి, కుజ, శని, రాహు, కేతువు, క్షీణ చంద్రుడు,
బుధుడు(పాపులతో కలసిన పాపి) అని ఉన్నది.

1) రవికి - చం, కు, గురువులు మిత్రులు : బుధుడు సముడు : శని, శుక్రులు
శత్రువులు.
2) చంద్రునకు - రవి, బుధులు మిత్రులు : మిగిలిన వారు బుధ, గురువు, శని, శుక్రులు సములు, శత్రువులు లేరు.
3) కుజునకు - రవి, చంద్ర, గురువులు మిత్రులు : బుధుడు శత్రువు: శని,
శుక్రులు సములు.
4) బుధునకు - రవి, శుక్రులు మిత్రులు : చంద్రుడు శత్రువు: కుజ, గురు,
శనులు సములు.
5) గురునకు - రవి, చంద్ర కుజులు మిత్రులు : శుక్ర, బుధులు శత్రువులు :
శని సముడు.
6) శుక్రునకు - శని, బుధులు మిత్రులు : కుజ, గురులు సములు: రవి, చంద్రుడు శత్రువులు.
7) శనినకు: శుక్ర, బుధులు మిత్రులు : రవి, చంద్ర, కుజులు శత్రువులు :
గురుడు సముడు.
చంద్రుడికి శత్రువులు లేరు.
గురువు ఎవరికి శత్రువు కాదు.

కొన్ని అనుమానాలు
1) రవికి - చం, కు, గురువులు మిత్రులు : బుధుడు సముడు : శని, శుక్రులు
శత్రువులు.
* రవి, శనులు పాపులు కదా పాపులు శత్రువులు ఎలా అయ్యారు?
* బుధుడు పాపులతో కలసిన పాపి, శుబులతో కలసిన శుభుడు - అనగా బుధునికి
పూర్ణ శుభత్వం లేదు పూర్ణ పాపత్వం లేదు. అటువంటప్పుడు రవికి బుధుడు
ఏవిధముగా శుభుడు?
* పూర్ణ చంద్రుడు శుభుడు, క్షీణ చంద్రుడు పాపి - వీరికి కూడా పూర్ణ
శుభత్వం లేదు పూర్ణ పాపత్వం లేదు. అటువంటప్పుడు రవికి మిత్రుడు ఎలా
అయ్యాడు?
* గురువు శుభ గ్రహం, రవి పాప గ్రహం - వీరెలా మిత్రులయ్యారు?
సత్యాచార్యుని హోరాశాస్త్రమందు గ్రహములకు గల మిత్ర శతృత్వ సంబంధాన్ని ఈ విధంగా తెలియజేశాడు.
సూత్రం:- గ్రహములకు తన మూల త్రికోణ రాశి నుండి, ద్వితీయ, ద్వాదశ, పంచమ, నవమాధిపతులు, స్వక్షేత్రం, ఉచ్చ రాశ్యాధిపతులు, ఆయుస్ధానాధిపతి అయిన అష్టమం, చతుర్ధాధిపతియు మిత్రులు. మిగతా స్ధానాధిపతులు శత్రువులు.
2,4,5,8,9,12 స్వ, ఉచ్చ రాశ్యాధిపతులు మిత్రులు, 3, 6,7,10,11 రాశ్యాధిపతులు శత్రువులు. మూల త్రికోణం నుండి లెక్కపెట్టినప్పుడు రెండు భావాలకు ఒక గ్రహం యొక్క ఆధిపత్యం మిత్ర, శత్రువులు అయినప్పుడు సములవుతారు.
పైన చెప్పిన విధంగా గ్రహానికి రెండు మిత్ర స్ధానాధిపతి మిత్రుడు అవుతాడు. పైన చెప్పిన విధంగా గ్రహానికి ఒకటి మిత్ర, శత్రు స్ధానాధిపతి సముడు అవుతున్నాడు. మిత్ర స్ధానాధిపతులు కాకుండా మిగతా వారు శత్రువులు అవుతారు. సూర్య చంద్రులకు ద్వయాధిపత్యం లేదు కనుక వారు ఏక రాశ్యాధిపాతులైనను మిత్రులే అవుతారు.
ఉదా;- రవికి - చం, కు, గురువులు మిత్రులు : బుధుడు సముడు : శని, శుక్రులు శత్రువులు.
సత్యాచార్యుడు చెప్పిన సూత్రం ప్రకారం సూర్యుని మూల త్రికోణ స్ధానం నుండి అనగా సింహరాశి నుండి ద్వాదశాధిపతి చంద్రుడు ఏక రాశ్యాధిపతి కావటం వలన మిత్రుడు అయ్యాడు.
సింహానికి చతుర్ధ రాశి వృశ్చికం, నవమ రాశి మేషం సూర్యునికి ఉచ్చ స్ధానం మేషం. కుజుడు ఈ మూడు స్ధానాలకు అధిపతై ద్విరాశ్యాధిపత్యం వలన సూర్యునికి కుజుడు మిత్రుడు అయ్యాడు.
సింహరాశికి పంచమ స్ధానం ధనస్సు, అష్టమ స్ధానం మీనం. ఈ రాశులకు అధిపతి గురువు. గురువు పై సూత్రం ప్రకారం ఉక్తరాశి ద్వయాధిపతి ఆగుట వలన సూర్యునికి గురువు మిత్రుడు అయ్యాడు.
సింహరాశికి ద్వితీయం కన్య, ఏకాదశ స్ధానం మిధునం. ఈ రెండు రాశులకు అధిపతి బుధుడు. పై సూత్రం ప్రకారం ద్వితీయం ఉక్త స్ధానం, ఏకాదశం ఉక్త స్ధానం కాకపోవటం వలన, ఉక్తైక రాశ్యాధిపతి (మిత్ర,శత్రు) అయిన బుధుడు సూర్యునికి సముడు అయ్యాడు.
సింహారాశికి షష్ఠమ, సప్తమ స్ధానాలు మకర, కుంభాలు. అవి ఉక్త స్ధానాలు కావు కనుక శని సూర్యునికి శత్రువు అవుతాడు.
సింహారాశికి దశమ, తృతీయ స్ధానములు వృషభ, తులలు. అవి ఉక్త స్ధానాలు కావు కనుక ఆ స్ధానానికి అధిపతి అగు శుక్రుడు సూర్యునికి శత్రువు అవుతాడు.
ఈ విధంగా మిగతా గ్రహాలకు మిత్ర, శత్రు, సమత్వాలను గుర్తించవచ్చును.

No comments:

Post a Comment

                         https://youtube.com/shorts/flB4WlmnbLs?si=SMNTDWimlM9c0PJd