గ్రహములు సూర్యుడున్న రాశికి ఒక నిర్ణయ రాశిలో ఉన్నప్పుడు వక్రించు చుండును . అనగా సూర్యుడున్న భాగములకు చెప్పబడిన భాగములో ఏదైనా ఒక గ్రహమున్నప్పుడు ఆ గ్రహము వక్రించును. అనగా సంచారమున ముందుకు పోవలసిన గ్రహము ముందునకు పోజాలక వెనుకకు వెళ్ళును. అట్టి స్థితి వక్రత్వమనబడును. మండల గ్రహములైన రవి,చంద్రులు ఎన్నడును వక్రించరు. తారా గ్రహములైన బుధ , గురు , శుక్ర , కుజ , శను లకు వక్రత్వము కలుగు చుండును. ఛాయా గ్రహములైన రాహు,కేతువులు మామూలుగా ఎల్లప్పుడు వక్రగతినే సంచారము చేయుదురు . గ్రహము వక్రించినపుడు శుభ ఫలితములు ఇచ్చునా ? అను విషయములో మహర్షులు భిన్నాభిప్రాయములు తెలిపియున్నారు .
నీచ యందున్న గ్రహము వక్రించినచో శుభ ఫలితము నిచ్చి అభివృద్ధి కలుగ జేయును . ఉచ్చ యందున్న గ్రహము వక్రించినచో ఆ గ్రహము యొక్క మహాదశ యోగించక కష్టములు కలుగ జేయును. రాశి చక్రములో ఉచ్చలో నున్న గ్రహము వక్రించి అంశ చక్రములో నీచను పొందియున్నచో , ఆ గ్రహము యొక్క మహాదశ బాగుగా యోగించును. మరియు శుభ గ్రహములు వక్రించినచో అనగా ఆధిపత్య శుభులు వక్రించినచో మంచి యోగము నిచ్చును. అధిపాపులు వక్రించినచో పాప ఫలములు అధికముగా కలుగును. వక్రించిన గ్రహము తానున్న రాశిని వదిలి వెనుక నున్న రాశిలోకి వచ్చినపుడు , పూర్వ రాశి ఫలితములే యిచ్చును. గురుడు మాత్రము వక్రించి వెనుక రాశిలో ప్రవేశించినచో , ఆ ప్రవేశించిన రాశి ఫలితములే యిచ్చును.
No comments:
Post a Comment