Thursday 12 December 2019

మకర లగ్నం :

రాశి చక్రములో ఇది నాల్గవ చర లగ్నము . ఈ లగ్నము బాలభాస్కర తేజస్సును సూచించును. మకర కాల గర్భము నందు అనంతములైన రహస్యములు దాగివున్నవని ఋగ్వేదమునందు సాక్ష్యము కలదు. అవి ఆధ్యాత్మిక సంకేత గర్భితములు. సూర్యకిరణములు దివ్య శక్తి పూరితములు. అవి ఉషః కాలమందు మరింత శక్తివంతంగా ఉండును. మకర మాసము దేవతల ఉషః కాలము. ఈ మకర లగ్నము మరణ ద్వారముగా గుర్తింప బడినది. జీవుల ఉత్పత్తికి అనగా పుట్టుటకు కర్కాటకము సంకేతము కాగా శారీరక మరణమునకు మకర లగ్నము ప్రభావము కలిగియున్నది. కాల స్వరూపుడు ఆయుష్కారకుడు , అయిన శని కి ఇది మొదటి స్వక్షేత్రము. మకర లగ్నము దేవతలకు ప్రాతః సంధ్యా కాలము. కర్కాటకము సాయం సంధ్యా కాలము. మొదటిది సురసంధ్య రెండవది అసుర సంధ్య . మకర లగ్నము నుండి కర్కాటకము వరకు లగ్నములు ఉత్తర దిశగా వంగి తోరణమువలె వుండును. దీనిని దేవాలయ పరిభాషలో మకర తోరణమని వ్యవహరించు చున్నారు. అనగా మరణమును అతిక్రమించిన దివ్య ప్రాంగణములోనికి అడుగిడుటకు సంకేతము. ఈ తోరణమే మానవునికి-దైవానికి వారధి. దైవము యొక్క సాయుజ్యమునను కాకపోయినను సామీప్యమును సూచించును. మకర , కర్కాటక లగ్నములకు అధిపతులైన శని , చంద్రులు ఇరువురు శీతల గ్రహములు. వీరికి భిన్నములైన సాంఖ్యసారూప్యము కలదు. ఒక రాశి ని అతిక్రమించుటకు చంద్రునికి 2 1/2 రోజులు పడితే శనికి 2 1/2 సంవత్సరములు పట్టుచున్నది. భౌతిక జన్మపై చంద్రునికి , భౌతిక మరణముపై శని కి ఆధిపత్య మెక్కువ.
లౌకిక కారకత్వములు :
ఈ లగ్నము కాలపురుషుని మోకాళ్ళని తెలియజేయును. వృషభ , కన్య, మకరములు శూద్రజాతికి చెందినవి. అత్యాశ , నేర్పరితనము , ఎత్తుగడలు , పిసినారి తనము , అధిక శ్రమ , స్వార్ధపరత్వము , దారుఢ్యము లేని శరీరము , అజీర్ణము , రక్త దోషములు , కీళ్లవాతములు , నెప్పులు , చర్మ వ్యాధులు , మొదలైనవి ఈ లగ్న కారకత్వము లోనివి.
లక్షణాలు :
గుండ్రని మొఖము , లోతైన కళ్ళు , సన్నని దేహము , కలిగి వుంటారు . ముతక అయిన తల వెంట్రుకలు కలిగి వుంటారు. కార్య సాధన స్వభావ మెక్కువ . పని నెరవేరే అవకాశముల కోసం ఎంతకాలమైనా వుంటారు. అమాయకుల వలె కనిపిస్తారు కానీ వ్యవహార సామర్ధ్యమెక్కువ. వీరిని కోపించిన వారిని అవసరమనుకుంటే సంతోషపెట్టి దాస్యము చేయించుకోగలరు.ఏ విషయములోనైనా తన క్రింద వారితో నిర్మొహమాటంగా ప్రవర్తించ గలరు. పై వారితో ప్రవర్తించలేరు. అపారమైన జ్నాపకశక్తి కలిగివుంటారు. అడ్రస్ లు , టెలిఫోన్ నెంబర్లు , ధరల వివరాలు , వేలకువేలు నోటిమీద గుర్తుంచుకొనగలరు. సంకల్ప బలం ఎక్కువ. ఓటమిని ఒక పట్టాన అంగీకరించరు.
మంచివాళ్ళని కూడా అనుమానించుట క్షేమమని వీరి నమ్మకము. కీడించి మేలెంచుట , ఏమరిపాటు లేకుండుట , వీరి మానసిక స్థితి . ధన , పదవీ వ్యామోహాలుంటాయి. అపకారము చేసిన మనిషిని ఎప్పటికీ మన్నించారు. వివాహ సందర్భములో తండ్రితో వివాదములు ఏర్పడవచ్చు.
ఈ లగ్నానికి అధిపతి అయిన శని ఆయుష్కారకుడు. ఈ శని నపుంసక గ్రహమే కాక క్రూర గ్రహము కూడా. తమోగుణ ప్రధానుడైన ఈతడు పశ్చిమ దిక్కునకు అధిపతి. దారిద్ర్యము , మరణము , ఆయుర్దాయము , దుఃఖము , దురదృష్టము , అనివార్య కష్టములు , ఆలస్యము , విషాదము , సోమరితనము , దీర్ఘ వ్యాధులు , , అలాగే జాగ్రత్త , పట్టుదల , శక్తి ,ధైర్యము , ఖర్చు చేయుటలో నేర్పరి తనము , పనులు చక్క బెట్టుటలో నేర్పు , ఆలోచనా శక్తి , జీవితములో ఒక ప్రత్యేక రంగములో అనుభవము కూడా ఇతని లక్షణములే ఇంకనూ మలమూత్ర వ్యాధులు , దంతములు , ఎముకల వ్యాధులు , ఆకస్మిక ప్రమాదములు , చలి , జలుబు , చేముడు , క్షయ , క్యాన్సరు , పక్షవాతము , మెదడుకి సంబంధించిన రోగములు , ఇతని కారకత్వములే . ఈ లగ్నమునకు బుధ , శుక్రు ల సంబంధము యోగము నిచ్చును. శని కేంద్ర కోణములలో యోగించును. శని , శుక్రు ల సంబంధము కేంద్రములలో మంచిది గాదు . శని , కుజు ల సంబంధము కేంద్ర , కోణములలో మంచిది. శని , గురు ల సంబంధం కేంద్రములయందు మంచిది. గురువు కేంద్రములయందు యోగించును. గురు , బుధ ల సంబంధము పాప స్థానముల యందు మంచిది. కుజుడు 4 , 10 , కేంద్రముల యందు , లాభము నందు యోగించును. శుక్రుడు
కోణములయందు యోగించును. సుకృనికి శని , బుధ ల సంబంధం వుండరాదు. బుధుడు కేంద్ర , కోణములలో యోగించును. రవి షష్టామవ్యయము లందు యోగించును. రాహు,కేతువు లు కేంద్రములందు యోగించును.

No comments:

Post a Comment

                         https://youtube.com/shorts/flB4WlmnbLs?si=SMNTDWimlM9c0PJd