Friday 13 December 2019

కుంభ లగ్నం :

ఇది రాశి చక్రములో అత్యంత పవిత్రమైన నాల్గవ స్థిర లగ్నము . వాయుతత్వపు త్రిపుటి లో మూడవది . ఆధ్యాత్మిక స్థాయి స్థిరమగుటకు కూడా ఈ లగ్నము ప్రాతినిధ్యము వహించును. మంత్రోఛారణ చేయు సాధకులలో పరవశత్వము , తాదాత్మ్యత అను ప్రభావములు ఈ లగ్నానికి సంబంధించినవే. ఈ లగ్నము కార్యకారణములపై ఆధిపత్యము వహించుచున్నది. ఒకానొక ఆదర్శము , ఆశయము , వాస్తవ రూపము ధరించుటకు ఈ లగ్నమునకు , ఈ లగ్న భావమునకు గల కీలక సూత్రము. పరమ గురువుల పరమ లక్ష్యము వాస్థవీకరించుటలో ఈ లగ్న దివ్య కారకత్వమే కారణము. బాధలు , కష్ట నష్టములు , అగ్ని పరీక్షలు , కరువు కాటకములు , మొదలైన బాధలు,గాధలు చేదుగా మారుచున్నప్పుడు ఈ లగ్న అధిపత్యము ఏర్పడును. యురేనస్ అను వరుణ గ్రహ మూర్తి ఈ లగ్నముపై సంపూర్ణ ఆధిపత్యము వహించును. ఈ లగ్నము యొక్క రంగు నీలి రంగుకు , వంగఛాయకు మధ్యస్థముగా వుండు ఛాయావర్ణము. సంగీతము మీద కూడా ఈ లగ్నమునకు ఆధిపత్యము కలదు. ఈ సంగీతము ఆత్మాభివ్యక్తీకరణ చెందు దివ్య సంగీత మగును. అనగా గాంధర్వ గానమగును. వరుణ గ్రహము సృష్టి లయములో ప్రధాన భూమికను పోషించును. అందుకనే పెద్దలు ఇది శివుని మూడవ కంటిలో వుండు నదిగా వ్యాఖ్యానిస్తారు. ఈ లగ్నమందు ఏ గ్రహము ఉచ్చ పొందుట గాని , నీచ పొందుట గాని జరుగదు . బుధ శుక్రు లకు మిత్ర క్షేత్రము గాని , రవి చంద్ర కుజ గురు లకు శత్రు క్షేత్రము గాను వహించును.
లౌకిక కారకత్వములు :
లలిత కలల యందు అభిరుచి , సంస్కృతి , తెలివి తేటలు , ఏ పనినైనా వాయిదా వేయుట , సోమరితనము , ఓర్పు , మధ్యపానాశక్తి , కంటి జబ్బులు , నరముల బలహీనత , రక్త హీనత , రక్త దోషము , గుండె జబ్బు , బెణుకు , నెప్పులు , విపరీత వ్యాధులు , సూక్ష్మ గ్రహణ శక్తి , ఈ లగ్న మూల సూత్రము. ఈ లగ్నము వారికి ప్రస్తుతపు సమాజమునకు సంబంధించి తీరని అసంతృప్తి వుంటుంది. చట్టాన్ని , వ్యవస్థని , పునః నిర్మించాలని ఆలోచిస్తారు. ఒక నిర్దిష్ట లక్ష్యమునకు ఉన్ముఖమైన ప్రణాళిక గల జీవితము ఏర్పడును. వీరి శక్తిని వీరు గమనిస్తే జీవితమును సద్వినియోగ పరచుకోగలరు. చక్కటి తర్క జ్నానము వుండును. ఈ లగ్నము వారికి ఆత్మ విశ్వాసము తక్కువ. పరిసరముల వ్యక్తుల భావ తరంగములు వీరిని ఎక్కువగా ప్రభావితులను చేయును. మత సాంఘిక ,ఆర్ధిక, రాజకీయ , సమస్యలు పరిష్కరించే రంగాలు వీరికి ఉపయోగపడును. విద్యా సంస్థలు నడుపుటలో వీరు ప్రావీణ్యం ఎక్కువగా కలిగి వుంటారు. వీరిది ప్రేమ తత్వము కానీ ప్రేమ వ్యక్తీకరణకు సంబంధించిన పనులు చేత కావు. వీరిని దగ్గరగా వున్నవారి కన్నా కొత్త పరిచయస్తులు ఎక్కువగా గౌరవిస్తారు. ఎంతటి అపకారినైనను హాని చేయలేరు. జ్యోతిషం , యోగ విద్య , మానసిక శక్తుల సాధనము , వైద్య శాఖ , మనస్తత్వ శాఖ , మొదలైనవి వీరికి రాణించును. శారీరక శ్రమతో కూడినవి గానీ , మార్పు లేక ఒకే విధమైన పని గాని వీరు చేయలేరు. వీరు ఎక్కువగా మేల్కొని యుండుట వలన చిరాకు , నిద్రలేమి , నరముల పట్లు , మెడ ,వెన్ను నొప్పి , నీరసము వుండును.
లక్షణాలు :
బలిష్టమైన శరీరము , గుండ్రని ముఖము , చక్కటి ముఖ వర్చస్సు , కలిగి వుంటారు. ఇతరుల కష్టములను తమవిగా భావించి ఉపకారము చేయగలరు. ఇతరుల మనోభావములను బాగుగా గ్రహించగలరు.పలుకుబడిని సంపాదించు వారగుదురు. వీరు ఎల్లప్పుడూ కళత్ర సుఖము కోసము పాటుపడుచున్ననూ విచారమే కలుగుచుండును. వీరి జీవితములో మధ్య మధ్య అవమానములు , అపవాదులు , తటస్థించుచుండును. విశేషమైన జ్నాపక శక్తి , పట్టుదల ,కార్య సాధన , ఏ విషయాన్నైనా బాగుగా పరిశీలించిన పిదప కార్య రంగము లోనికి దిగుట ,
శాస్త్రీయమైన సత్యాన్వేషణ వీరికి స్వభావ సిద్ధ్హము . వీరి మంచితనము అంతరంగములో వుండును గాని పైకి కనిపించక పోవుట ఈ లగ్నము వారి యొక్క ప్రత్యేకతగా చెప్పవచ్చు. వీరు మత సంబంధమైన విషయాలలో ఆసక్తిని చూపిస్తారు. సుగంధ ద్రవ్యాలన్నా , పువ్వు లన్నా , ఎక్కువ ప్రీతి కలిగి వుంటారు.
వీరికి అంటు వ్యాధులు , దంత వ్యాధులు , రక్త ప్రసారము , మితిమీరిన శ్రమ , వీరి శరీరాన్ని ఇబ్బంది పెట్టవచ్చు.
ఈ లగ్నమునకు రవి,కుజ ,శను లు ఒంటరిగా కేంద్ర కోణములలో యోగము నిచ్చెదరు. గురువు లాభము నందు కంటే ద్వితీయాన యోగము నిచ్చును. శని ద్వితీయం , ద్వాదశములలో యోగము నిచ్చును.

No comments:

Post a Comment

                         https://youtube.com/shorts/flB4WlmnbLs?si=SMNTDWimlM9c0PJd