Sunday 15 December 2019

మీన లగ్నం :

ఈ లగ్నము ద్వాదశ లగ్నాలలో చిట్ట చివరిది. నిజానికి , రాశి చక్రములో ఈ లగ్నము మొట్ట మొదటిది. మరియు చివరిది. ఈ లగ్న సంకేతమును పరిశీలిస్తే రెండు చేపలు వుండును . ఒకటి ఒక దిశ లోనూ , మరొకటి వ్యతిరేక దిశలోనూ వున్నట్లుండును. మకరము సృష్టి యొక్క తుది మొదళ్లను సూచిస్తే , మీనం సృష్టి చివరలో మొదలుని , ప్రారంభములో వున్న అంత్యమును సూచించును. ఈ లగ్న ప్రభావము దేహములోని సుషుమ్నా నాడి పై వుండును. ఈ లగ్న సంకేతమైన మత్స్య మనగా రెండు విరుద్ధ శక్తులు కలిసి బహిర్గత మగుచున్న వెలుగుగా పెద్దలు చెప్పుచున్నారు. మానవుని పరిపూర్ణదశకు పరిణమించు ఉచ్చ స్థితిని కుంభ లగ్నము సూచిస్తే మానవుడు బ్రహ్మ యే అగు చరమ స్థితిని మీనము సూచించును. జీవుల భౌతిక పరిణామము జల చరములతో మొదలగును. ఈ పరిణామముపై మీన ప్రభావమున్నది. ఈ పరిణామము మానవ దేహముతో అంతమగును. ఆధ్యాత్మిక పరిణామము మకరముతో ప్రారంభమై మీనముతో అంతమగును.
మీనము తృతీయ జల తత్వ లగ్నము . మొదటి జలలగ్నమైన కర్కాటకము మరణానంతరము ప్రాణము యొక్క చివరి దశను , వృశ్చికము భౌతిక జీవిత చివరి దశను , మీనము ఆధ్యాత్మిక జీవిత చివరి దశను సూచించును. మీనమునకు చెందిన మత్స్యద్వయ సంకేతము మూతపడని జగన్మాత యొక్క (మీనాక్షీ దేవి)నేత్ర ద్వయముగా ఋషులు కీర్తించెదరు.
ఈ లగ్నము జన్మ లగ్నముగా గాని , చంద్ర లగ్నముగా గాని , వున్న మానవులకు కన్నులలో ఒక రకమైన తేజో శక్తి ఇమిడి వుండును. కారుణ్య పూరిత మానవ సేవా కార్యక్రమములపై ఈ లగ్న ప్రభావము వుండును. ఈ లగ్న జాతకులు సమస్త జీవులయందు వున్న సామాన్య లక్షణము పై దృష్టిని ప్రసరింపగా , వైరుధ్య భావములు కన్యా లగ్నము వారికి కనిపించును. అనగా కన్యా లగ్నము విశేషణాత్మకము , మీనము సమ్మేళనాత్మకము. మెగ్నీషియం అనే ధాతువు ఈ లగ్న ప్రభావమునకు చెందినది.

లౌకిక కారకత్వములు :

భూతదయ , భావోద్రేకము , ధార్మిక బుద్ధి , శాస్త్రముల యందు , కళల యందు , కొంత ప్రావీణ్యత , ఒడిదుడుకులు లేని జీవితమునందు కోరిక , అలాగే పుణ్య నదులు , పుణ్య క్షేత్రములు , కీళ్ల జబ్బులు , నరముల బలహీనత , నీరు పట్టుట మొదలైనవి.

రూప స్వభావములు :

బలహీనమైన శరీరం గలవారు. చేతులు ,పాదములు కొద్దిగా పుష్టిగా కలవారు. ఉబ్బిన కళ్ళు , అందమైన జుట్టు కలిగి వుంటారు. వీరి అభిప్రాయములు నిలకడగా వుండవు. కవిత్వము నందు గాని , గ్రంధ రచనల యందు గాని , కౌశలము కలిగి వుంటారు. చిన్న తనములో అనేక గండములను దాటుతారు. ఇతరులను తేలికగా నమ్మి మోసపోవుటకు ఎక్కువ అవకాశము గలవారు. ఈ లగ్నము వారికి అదృష్టముతో పాటు ఆటంకములు కూడా ఎక్కువే. వీరు మాట్లాడే భాషలో ఒక రకమైన శక్తి వుండి ఇతరులను ఆకర్షించ గలుగుతారు.
ఈ లగ్నమునకు చంద్రుడు , బుధుడు , కుజ గురు లు , కేంద్ర కొణములలో యోగిస్తారు. రవి చంద్రులు గాని , రవి కుజ లు గాని , రవి గురు లు గాని , రవి శుక్రు లు గాని , రవి శను ల కలయిక గాని మంచిది కాదు.

No comments:

Post a Comment

                         https://youtube.com/shorts/flB4WlmnbLs?si=SMNTDWimlM9c0PJd