Tuesday 3 December 2019

వృషభ లగ్నం :

ఇది స్థిర లగ్నము . పృధ్వీతత్వాన్ని కలిగి వుంటుంది. రజోగుణమైనది .నీల వర్ణాన్ని కలిగి వుంటుంది. భోగము ,ఆనందము ,కార్య దీక్ష ,సౌందర్యము ,ప్రాక్టికల్ థింకింగ్ ఈ లగ్న మూల లక్షణములు.ముఖ్యముగా స్త్రీ పురుష లింగ భేధము నేర్పరచుటలో ఈ లగ్నము మూలకారణమవుతున్నది .ఎందుకంటే దీనికి సప్తమలగ్నమైన వృశ్చికము మర్మస్థానముల మీద ఆధిపత్యము కలిగివుండుట చేత మొత్తము సృష్ఠి అంతా కూడా వృషభ , వృశ్చిక లగ్నములను ప్రధానముగా చేసుకొని క్రీడించుచున్నట్లుండును.ఈ లగ్న స్త్రీ లలో కొన్ని పురుష సంభంధ లక్షణాలు, పురుషులలో స్త్రీ సంభంధ లక్షణములు మేళవించి వుండును.ఈ లగ్నము మిక్కిలి నిగూఢమైనది . సాక్షాత్తు దేవదేవుడైన శ్రీ కృష్ణ పరమాత్మ ఈ లగ్నము ద్వారానే తన పరిపూర్ణ అవతార విశేషమును వ్యక్తపరచుట మనము గమనించవచ్చు .
లక్షణాలు :
పట్టుదల , స్థిరమైన అభిప్రాయాలు , స్వభావమందు మార్పు లేకుండుట , సౌమ్యత ,త్వరగా కోపము రాదు ,వచ్చిన కోపము త్వరగా పోదు. ఈ లగ్నము వారికి మానసిక స్థితిలో లోపము ఏర్పడి దురభిప్రాయాలు ,ద్వేషము , ఈర్ష్యాసూయలు ఏర్పడి అవి కూడా స్థిరపడి పోవును . వీరికి స్వలాభ తత్వమధికము . ఇతరుల అభిప్రాయములను విందురే గాని తమకు తోచిన విధము గానే ప్రవర్తింతురు . వీరికి ఆటుపోటులను తట్టుకోగల శక్తి ప్రకృతి సహజముగానే ఏర్పడగలదు .ఎంత పెద్ద విజయమైనప్పటికి వీరిని ఆశ్చర్య పరచదు .దానికి కారణం అదలా రావటం సహజమేనని వారికున్న నమ్మకం .వీరి మానసిక స్థితి ఉన్నతముగా బలీయముగా రూపొందుతున్న కొద్దీ వీరికి రాజకీయము ,అధికారాలు , పెద్ద పెద్ద సంస్థల బాధ్యతల నిర్వహణ వీరికి సులువు అవుతుంది. వీరు కష్టపడి పని చెయ్యటం , చేయించటం తెల్సిన వారు. వృక్షాల పెంపకం , జంతు పోషణ ,వ్యవసాయం , వ్యాపారాలు వీరికి రాణిస్తాయి . ఒక పనికి ఆరంభంలో కొద్దిగా బద్ధకించిననూ మొదలు పెడితే చివరి వరకు నిలబడటం వీరిలోని ప్రత్యేక గుణం . వీరికి టైమ్ సెన్స్ ఎక్కువ . ఇతరులకు విసుగనిపించే విషయాలు వీరికి కుతూహలంగా మారతాయి . పరశుభ్ర త , ఇంద్రియ తృప్తి , రుచులను కోరుకుంటారు.వీరు కష్టపడుట మాత్రమే గాక బాగుగా సుఖపడుట కూడా తెల్సిన వారు .తమకు దక్కవలసిన వాటిలో అణాపైసలు కూడా వదిలి పెట్టరు. వీరికి కీర్తి కాంక్ష ఎక్కువ . వీరితో చెలిమి కూడిన వారిని ఇంకొకరితో చనువుగా వుండటం వీరు సహించలేరు .
ఈ వృషభ లగ్నానికి ఇతర నైసర్గిక లగ్నాల ద్వారా ఏర్పడే శుభాశుభములు సప్తమ ,వ్యయ లగ్నములు కుజ లగ్నముల కారణముగా చిన్న తనములో ఎత్తు మీద నుండి క్రింద పడటం , జల సంభంధ ప్రమాదాలు , మర్మాంగ దోషాలు , తృతీయ చంద్ర లగ్నము కారణముగా శ్వాస కోశ సంభంధ వ్యాధులేర్పడతాయి . అతి శ్రమ ,అతి భోజనము వలన అజీర్ణ వ్యాధు లేర్పడతాయి . తో బుట్టువులతో మంచి సంభంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవటం కష్టము . ధన , పంచమ లగ్నాలు బుధ లగ్నాలు కారణంగా ఈ లగ్నము వారికి ఆకస్మికంగా ధన యోగాలు ఏర్పడును. 30 సంవత్సరాల లోపు కలిగిన సంతతి వీరి మాట వినరు. వీరి శత్రువులు వీరికి ప్రత్యక్షంగా వుంటుంటారు . మానసిక కర్మ క్షేత్రాలు (సింహం , కుంభం) స్థిర లగ్నాలవటం చేత మంచి శరీర పటుత్వముతో నలుగురి శ్రమ వీరొక్కరే చెయ్యగలగటం , స్థిరముగా కూర్చొని పని చేస్తున్న కొద్దీ వీరి శక్తి సామర్ధ్యాలు మరింత పెరగటం , వీరి శ్రమని తమకు నచ్చిన వారు గుర్తించాలని కోరుకోవటం , ప్రతివిషయాన్నీ బాగుగా పరిశీలించిన తరువాతనే ఒక నిర్ణయానికి రావటం వీరి ప్రత్యేక లక్షణాలు .
ఈ లగ్నానికి శుక్రుడు కోణ,వ్యయమాలలో యోగిస్తాడు.
చంద్రుడు కేంద్రాలలో కన్నా కోణాలలో శుభుడు.
రవి కేంద్రాలలో యోగించును.
పాప స్థానాలలో గురువు యోగించును.
శని , కుజ లు , అదే విధంగా రాహు ,కేతు వులు కూడా కేంద్రాలలో యోగిస్తారు.
బుధుడు కోణములలో యోగించును .

No comments:

Post a Comment

                         https://youtube.com/shorts/flB4WlmnbLs?si=SMNTDWimlM9c0PJd