Wednesday 4 December 2019

మిధున లగ్నం :

ఈ లగ్నము ప్రధమ ద్విస్వభావ లగ్నము. వాయుతత్వము కలది . ఈ లగ్నానికి వైరుధ్యములను దర్శించు శక్తి ఎక్కువ. మంచి - చెడుల వివేక లక్షణము ఈ లగ్నము యొక్క కీలక లక్షణము. జనన మరణాలను , చీకటి వెలుగులను వివేచించి చూడగల శక్తిని మానవుడు ఈ లగ్నము వలన పొందుచున్నాడు. ఈ లగ్నము వలననే జాతుల మధ్య , వ్యక్తుల మధ్య రాజకీయ మత భేధములు కలుగు చున్నవి. వైరుధ్యములను పరిష్కరించగల నిష్పక్ష పాత బుద్ధి కూడా ఈ లగ్నము నందే వుండును.
విజ్నాన శాస్త్రములో అతి నిర్ధుష్టమైన గణిత శాస్త్రము ఈ లగ్నాధిపతి అయిన బుధుని కారకత్వమునకు చెందినది .
బుధుని యొక్క సంఖ్యాత్మక శక్తి అయిదు గా ఋషులు గుర్తించారు . ఈ లగ్నము సత్వ గుణ ప్రధానమైనది . వైశ్య జాతి . ఈ లగ్న రాశి హరిత వర్ణముపై ఆధిత్యము గలది .ఈ లగ్నము నందు జన్మించిన వారు పొడవు , నిటారుగా ఉండు దేహము , సన్నని పాదాలు , నిశితమగు దృష్టిని కలిగి ఉంటారు . వీరికి చమత్కార ధోరణి ఎక్కువ . ఇతరుల అభిప్రాయములను కనిపెట్టి తదనుగుణముగా ప్రవర్తించుట వీరి ప్రత్యేకత . వీరికి ఏ విషయములోనైన పరిపూర్ణత సాధించుట చాలా కష్టము. వీరి మానసిక స్థితి అధోస్థాయికి చేరితే స్వామిద్రోహము చేయుటకు కూడా వెనుకాడరు. తప్పుడు మార్గాలలో నడవటం , కుటిలోపాయములు పన్నటం వీరికి సులభ సాధ్యము . నీతులు చెప్పినంతగా ఆచరించుట వుండదు. వీరికి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. రాత యందు , చర్చించుట యందు నిపుణత ఉంటుంది . వీరికి చురుకుదనము , చాకచక్యము ఎక్కువ . సందేహములు , చిరాకు ఎక్కువ. తక్కువ చొరవ కలిగిన వారు. ఇద్దరి మధ్య భేధాభి ప్రాయములను తీర్చి కలపగలరు. అవసరమనుకుంటే భేధాభిప్రాయములను సృష్టించి విడదీయగలరు . కంగారు , భయము , కోపము , వస్తే వీరి మానసిక శక్తి క్షీణించిపోవును. పైకి గంభీరతే గాని లోపల పిరికితనం ఉంటుంది. జాగ్రత్త ఎక్కువ . పని అవసరమనుకుంటే తలవంచి కూడా పూర్తి చేసుకుంటారు.
లక్షణాలు :
లగ్న , చతుర్ధాలకు బుధుడు అధిపతి ఆగుట కారణంగా , బంధువుల విషయాలలో గాని , కుటుంబ విషయాలలో గాని రహస్యాలుంటాయి . నరాల బలహీనతలుంటాయి . మానసిక వ్యాధులు , నత్తి , చెముడు , తలనెప్పి , ఉన్మాదములు కలుగుటకు ఈ బుధుదే కారణము . అదే విధంగా చట్టము , న్యాయము , ధర్మ శాస్త్రములందలి సూక్ష్మములు పసిగట్టుట కూడా ఈ లగ్నాధిపతి అయిన బుధుని కారణము . నిద్రపట్టక పోవటం , అతి ఆలోచనలు , దిగులు పడినప్పుడల్లా జీర్ణకోశము పాడగును . వృత్తులలో మార్పులేర్పడును . జీవితములో అదృష్టము ఒడిదుడుకులకు లోనగును. లాటరీ , స్పెకులేషన్ వంటి వ్యవహారములలో లాభించుటకు అవకాశము కలదు. ఈ పని చేసినను ఎంత లాభముండునోనని ఆలోచించి పని ప్రారంభిస్తారు. పూర్తిగా ఎవ్వరిని నమ్మరు. అష్టమ , నవమ లగ్నాలు శని సంభందములైనవి. కావున మోకాళ్ళు , మెడ , వెన్ను అవయవముల గురించి ఆరోగ్య విషయములలో జాగ్రత్తగా వుండాలి . షష్ట లాభములు కుజ లగ్నాలు కావటం మూలాన వీరి సోదరులలో ఒకరికి పెద్ద ఉద్యోగం వస్తుంది . పంచమ , వ్యయ లగ్నాలు శుక్ర లగ్నాలవటం వలన సంతతి మీద అపేక్ష ఎక్కువ గాను , ఖర్చు విషయం లో లోభత్వముగానూ ప్రవర్తిస్తారు. సప్తమ , దశమ లగ్నాలు గురు లగ్నాలు కావటం కారణంగా : అదృష్టము , అవకాశాలు , ధన విషయాలు చంచలంగా వుండును. ధన సంభంధ విషయాలలో పర స్త్రీ సాంగత్యం ఏర్పడవచ్చు. భార్య , పిల్లలకు వీరు విశ్వాస పాత్రులు కారు . మొత్తం మీద వీరికి తెలివి ఎక్కువ గాను ,సుఖము తక్కువ గాను వుండును.
లక్షణాలు :
సమన్వయ శక్తి తెలివి , విషయ పరిజ్నానము ,మేనత్తలు , మేనమామలు , సాధకులు , ప్రచారం , తంతి తపాలా , అనువాదము , రాయబారము , మిమిక్రీ , డిక్షనరీస్, పుస్తకాలు , రెవెన్యూ శాఖలు , వాణిజ్య శాఖలు ,టెలిఫోన్ ,టైపు , టెలివిజన్ , తెలివి తేటలు , శాస్త్ర పాండిత్యము , ధాన్యాగారములు , న్యుమోనియా , క్షయ , నాట్య శాస్త్రము , తర్క శాస్త్రము , అధర్వణ వేదము , బహుభాషా జ్నానము, మొదలైనవి.

No comments:

Post a Comment

                         https://youtube.com/shorts/flB4WlmnbLs?si=SMNTDWimlM9c0PJd