Sunday 8 December 2019

కన్యా లగ్నం :

ఇది రాశి చక్రమున రెండవ ద్విస్వభావ లగ్నము మరియు రెండవ భూ తత్వ లగ్నము . ప్రకృతి యొక్క మాతృత్వము కర్కాటకము కాగా ; పరబ్రహ్మము యొక్క మాతృత్వము కన్యా లగ్నము నందున్నది.. సౌందర్యము వృషభ లగ్నమునకు చెందినది కాగా అనుగ్రహము కన్యా లగ్నమునకు చెందినది. కన్యా లగ్నము నుండి వృశ్చిక లగ్నము వరకు 90 భాగాల భాగము మానవుని బొడ్డు నుండి తొడల వరకు ఆధిపత్యము వహించును. ఇతరులకు ఉపచారములు , సేవ చేయుటకు ఈ లగ్నము ప్రాముఖ్యము వహించుచున్నది. ప్రసూతి , శిశు సంరక్షణాలయములు ఈ లగ్న ప్రభావము లోనివే ! కాన్వెంట్లు , విద్యాభోదనము , అనాధ శరణాలయములు , వికలాంగుల పాఠశాలలు , కుష్టు రోగుల నివాస ప్రాంతాలు , క్షయ రోగ ఆసుపత్రులు , ఇవి ఈ లగ్న ప్రభావంలో ఏర్పడినవే ! రేడియో , చెరకు గడ ఈ లగ్న ప్రభావం నుండి ఉద్భవించినవే.
కారకత్వాలు :
శాస్త్ర విజ్నానము , లలిత కళలు , విమర్శనాత్మక శక్తి , సందేహ బుద్ధి , ఉదార స్వభావం , పారిశ్రామిక నగరాలు , పొట్ట , నాభి ప్రదేశము , వెన్నెముక క్రింది భాగము , అజీర్ణ వ్యాధులు , చురుకు దానము , శారీరక శ్రమ కన్నా మానసిక శ్రమ యందు యిష్టత , సిగ్గు , నవ్వు , గణిత శాస్త్రము , తర్కము , పలురకాలైన లిపుల వ్యాకరణము , జ్నాపక శక్తి , బెణుకుట , మానసిక వ్యాధులు , సహనము , భృత్యులు మొ ||వి .
లక్షణాలు :
సన్నని పొడవైన శరీరం , నల్లని కళ్ళు , నల్లని దట్టమైన వెండ్రుకలు , సుకుమార కంఠస్వరం , త్వరితంగా నడవటం , ఉన్న వయస్సు కన్నా తక్కువగా కన్పిస్తారు . మొహమాటం లేకుండా ఇతరుల చేత పనులు చేయించుకోగలరు. ఇతరుల తప్పులు ఎన్నుటలో ప్రసిద్ధులు. సుఖమన్నా , సుఖ జీవనమన్నా అధిక ప్రీతి వుంటుంది. సంగీత ప్రియత్వం వుంటుంది. ఉత్తరాలు వ్రాయటంలో నేర్పరులు. ఖర్చు చేయటంలో ఎక్కువ జాగ్రత్తను ప్రదర్శిస్తారు. మనసుకు నచ్చిన పనులు మాత్రమే చేస్తారు. కష్టమైన పనులు సులువెరిగి ప్రయత్నిస్తారు. వీరి కష్టములను ఎవరికైనా చెప్పుకొనుటలో తృప్తి పడతారు. వీరికి చొరవ ఎక్కువగానే వుంటుంది గానీ అంతకు మించి బిడియం కూడా వుంటుంది. అపకారం చేసిన వారిని చిరకాలం ద్వేషిస్తూనే వుంటారు. వాణిజ్య ప్రావీణ్యం వుంటుంది. నటన , అనుకరణము , హాస్యము , వక్తృత్వము , ఈ లగ్నప్రభావములోనివే .
ఈ లగ్నమునకు శుక్రుడు ఒక్కడే శుభుడు . తృతీయ అష్టమాధిపతి అగుటచే కుజుడును , ఉభయ కేంద్రధిపత్యమగుటచే గురువును , ముఖ్య పాపులు అవుతారు.
ఈ లగ్నానికి గురు , బుధ లు పాప స్థానాలలో వుంటే యోగిస్తారు. కుజుడు వ్యయమందు యోగమిచ్చుట ఈ లగ్నానికి గల ముఖ్య విశేషము.
శని దశమ కేంద్రమందు అధిక యోగమిచ్చును. రాహు , కేతువులు 3,6 యందున్న యొడల మంచిది.

No comments:

Post a Comment

                         https://youtube.com/shorts/flB4WlmnbLs?si=SMNTDWimlM9c0PJd