Monday 9 December 2019

తులా లగ్నము :

ఈ లగ్నము రాశి చక్రమున మూడవ చర లగ్నము. రెండవ వాయు తత్వపు లగ్నము. బ్రహ్మాండము నందలి ఆధార బిందువుకు , ధర్మమునకు , ఈ లగ్నము ప్రాతినిధ్యము వహించును. వైవిధ్యము నుండి ఏకత్వమును సాధించుట ఈ లగ్నము యొక్క ఆంతర్య ధర్మము. అంతర్ముఖ స్థితి నుండి బ్రహ్మాండము బాహ్యముగా వ్యక్తమగుటకు ఈ లగ్న ప్రభావమే కారణము. రాశి చక్రమున తులా లగ్నము సప్తమ లగ్నము . సప్తమము ద్వారా వివాహము , జీవిత భాగస్వామి , లైంగిక ఆకర్షణ మొదలగునవి ఇమిడి ఉండును. ఆధునిక నాగరికత యొక్క వైభవములైన మహానగరములు , పరిశ్రమలు , ఫోటోగ్రఫీ , సినిమా , నాటకము , జీవితము నందలి గొప్ప గొప్ప విలాస పూరితమైన అనుభవములు ఈ లగ్న ప్రభావానికి లోనై వుండును. నటులు , నృత్య కళాకారులు , కీర్తివంతులైన కళాకారులు ఈ లగ్న ప్రభావం లోనే వుంటారు. దుస్తులు , సువాసనా ద్రవ్యాలు , ఆహార పానీయాలు , రుచులు , అలంకరణ సామాగ్రి ,మొదలైనవి కూడా ఈ లగ్న ప్రభావం లోనివే .ఈ లగ్నము యొక్క సాంఖ్యాక శక్తి నాలుగు (4).
అయస్కాంతపు ఇనుము ఈ లగ్నము ప్రభావానికి చెందినది. మానవుని లోని అంతర్గత తత్వము లోని వివిధ అంశములను విస్తృత పరచి బాహ్యమునకు ప్రకటించుటలో ఈ లగ్న ప్రభావము ఎక్కువగా వుండును.
కారకత్వములు :
సమ బుద్ది , వాచాలత , సుఖలోలత , నిష్పాక్షిక ప్రవర్తన , అనుకరణ , ఆందోళన చెందుట , వినయ విధేయత , గౌరవము , రాజు , ప్రవర్తన , చట్టము , న్యాయము అను విశ్వాసము , అభిప్రాయాలలో స్పష్టత , ఒకప్పుడు ఆశ మరియొకప్పుడు నిరాశ , మోసమును తట్టుకోలేకపోవుట , పోల్చి చూచుట మొదలైనవి.
ఈ లగ్నము నందు జననమైన వారు పొడవుగా , చక్కగా శరీర సౌష్టవము కలిగి వుంటారు. చక్కని కనుబొమ్మలు , ముక్కు కొద్దిగా వంకర తిరిగి వుండుట , వీరి శిరో భాగము వయస్సు మీరిన కొలదీ బట్టతలగా మారును. ఈ లగ్నము వారికి సున్నిత స్వభావము , విషయములను నూతనముగా , లోతుగా ఆలోచించ గలగటం వుండును. వీరికి హాస్యమనిన ఇష్టము అధికము. కవిత్వ సంగీతాదుల పట్ల ఆసక్తిని కలిగి వుంటారు. ప్రయాణాలనిన ప్రీతికరము . ఎల్లప్పుడూ గౌరవ , ప్రతిష్టల కొరకు తాపత్రయ పడతారు. స్నేహ పాత్రులు . ఎంత త్వరగా కోపము వచ్చునో అంతా త్వరగా శాంతులవుతారు. వీరికి అభిమానము , స్వాతి శయము , ఎక్కువ. వీరికి మూత్రపిండములు , కటిప్రదేశము , మూత్రాశయములకు చెందిన అనారోగ్యములు , మధుమేహము , మలబద్ధకము , ఏర్పడే అవకాశము కలదు.
వీరికి విద్యుత్ శాఖ , రేడియో , టీ,వి ,ధర్మ శాస్త్రము , వాణిజ్యము , వైద్యము , మొదలైనవి రాణించే రంగములు . ఈ లగ్నము వారికి శని , బుధ లు శుభులు . తృతీయ ,షష్టాధిపతి అగుటచే గురువును , లాభాధిపతి అగుటచే రవి , ద్వితీయ , సప్తమాధిపతి అగుటచే కుజుడు పాపులు.
లగ్నాధిపతి లగ్నములో యోగమును ఇవ్వడు. మిగిలిన కేంద్రములైతే మంచివి.
చంద్రుడు పాప స్థానములందు యోగించును.
బుధుడు కేంద్ర , కోణములందు యోగించును.
రవి భాగ్యములో మంచివాడు .
గురువు కేంద్రములందు మంచివాడు.
శనికి కేంద్ర స్థితి మంచిదైనప్పటికి , లగ్న ,చతుర్ధాలందు మిక్కిలి యోగము ఇవ్వలేదు. మిగిలిన కేంద్రము (సప్తమ , దశమ) లందు అధిక యోగము నిచ్చును.
కుజుడు కేంద్ర స్థితి యందు బాగుండును.

No comments:

Post a Comment

                         https://youtube.com/shorts/flB4WlmnbLs?si=SMNTDWimlM9c0PJd