Wednesday 1 January 2020

ఆరూఢ చక్రము వేయు విధానము :

ఆరూఢములు 9 విధములు. 1. లగ్నారూఢము , 2.ధనా రూఢము , 3. వాహనా రూఢము , 4. పుత్రా రూఢము ,
5. దారా రూఢము , 6. భాగ్యా రూఢము , 7. రాజ్యా రూఢము , 8 . లాభా రూఢము , 9. ఉపపదము. అని
9 ఆరూఢములు కలవు. 2,6,8 స్థానములకు ఆరూఢము చెప్పబడి యుండలేదు. కొందరు లాభారూఢమును వదిలి మిగిలిన 8 ఆరూఢములను మాత్రమే చెప్పియున్నారు.
లగ్నాధిపతి జన్మలగ్నము లగాయితు ఎన్నవ రాశి యందుండునో ఆ లగ్నాధిపతి యున్న రాశి లగాయితు , అన్నవ రాశి ఆరూఢలగ్నమగును .
ఉదా : జన్మ లగ్నము సింహము . సింహ రాశి అధిపతి రవి. ఆ రవి జాతకములో సింహ లగ్నము లగాయితు ఆరవ స్థానములో మకరమందుండెను. అందుచే ఆ మకరము లగాయితు ఆరవ స్థానము మిధునము ఆరూఢలగ్నమగును. సింహలగ్నమునకు ధనస్థానమున కన్య. ఆ కన్యకు అధిపతి బుధుడు. ధనస్థానమైన కన్య లగాయితు అయిదవ స్థానమైన మకరములో ఉన్నాడు. అందుచే ఆ మకరము లగాయితు అయిదవ స్థానము వృషభము ధనారూఢమగును. అట్లే యితర ఆరూఢములను వేయవలయును.
ఉదా : ఈ క్రింది జాతకమునకు , రాశి ,ఆరూఢమూలు వేయబడెను.
ఎవడు పూర్వ జన్మలో స్వమత కులధర్మములను విడువక , తల్లిదండ్రుల యందును , దేవతల యందును ,
శ్రద్ధా భక్తులతో దైవపూజాదురంధరుడై ప్రవర్తించునో అట్టివాడు ఈ జన్మమున భూపాలుడగునని మన జ్యోతిష శాస్త్ర గ్రంధములలో , సమస్త పురాణములలో , వేదములలో , ఉపనిషత్తులలో చెప్పబడియున్నది.
ఆరూఢ చక్ర ఫలితములు : --
జాతములో నున్న గ్రహములలో ఏ గ్రహము ఎక్కువ భాగలు భుక్తి అయినవో, ఆ గ్రహము ఎక్కువ బలమైనదని తెలియవలయును. స్వోచ్చయందున్న గ్రహమునకు నృపపదము (రాజ్యా రూఢము) పట్టి అధిక భాగాధిక గ్రహమైనచో , ఆ గ్రహము యొక్క దశలో రాజయోగము పట్టును. నీచ,శత్రుయందున్న గ్రహములు యోగము నీయజాలవు. మరియు అస్తంగతగ్రహములు , నీచ పొందిన గ్రహములు , పరాజిత గ్రహములు (అనగా ఓడిపోయిన గ్రహములు) శుభ ఫలములు నీయజాలవు. భాగ్యా రూఢమందు మూడు గ్రహములున్నచో భాగ్యము పట్టును. నాల్గు గ్ర్హములు భాగ్యా రూఢమందున్న భాగ్య , యోగములు రెండునూ కలుగును. అయిదు గ్రహములున్న రాజయోగము పట్టును. పరమోచ్చ యందున్న గ్రహము పూర్ణ బలమును , స్వక్షేత్ర మందున్న గ్రహము సామాన్య బలమును కలిగి యుండును . ఆరూఢ లగ్నాధిపతి , ధన రూఢాధిపతి, వాహన రూఢాధిపతి, పుత్ర రూఢాధిపతి , భాగ్య రూఢాధిపతి , రాజ్యా రూఢాధిపతి , వీరు ఆరుగురు కలసి వాహనా రూఢములో గానీ ,రాజ్యా రూఢములోగానీ, భాగ్యా రూఢమందు గానీ ఉన్నచో గజ , తురగ , ఛత్ర , చామరాది వైభవముతో కూడిన సామంతరాజు అగును. ఆరూఢమును పదమని కూడా చెప్పుచుందురు. ఏడు పదముల మాలిక బట్టిన గజ , తురగ , ఛత్ర , చామర , ధ్వజాది వైభవ సంపన్నుడైన రాజగును. ఎనిమిది ఆరూఢములు మాలిక బట్టిన సామంత రాజులచే సేవింపబడు రాజగును. సకల దేశ రాజులచే పూజింపబడు రాజగును. ఎనిమిది పదము కంటే ఎక్కువ ఆరూఢమూలు మాలిక పట్టిన చక్రవర్తి యగును. ఒకే గ్రహమునకు ఆరు పదములకు ఆధిపత్యము పట్టిన , ఆరు ఆరూఢాధిపతులు గలసి యున్ననూ మహారాజగును . ఒకే గ్రహమునకు అయిదు ఆరూఢములకు ఆధిపత్యము పట్టినను , అయిదు ఆరూఢాధిపతులు కలసి యున్ననూ మహారాజగును. లాభా రూఢములో శుక్ర,గురు,చంద్రులున్ననూ , వీరు ఆరూఢలగ్నమును చూచుచున్ననూ , విద్యా,సంతానము,ధనము, రాజయోగము కలుగును. బుధ,గురు,శుక్ర, చంద్రులు నలుగురూ గానీ , వీరిలో కొందరు గానీ , ఆరూఢలగ్నమునకు కేంద్రములో ఉన్నచో విద్య,సంతానము , ధనయోగము కలుగును. ఆరూఢ లగ్నమును గానీ , రాజ్యారూఢమును గానీ , శుక్రునిచే చూడబడుచున్ననూ , భాగ్యారూఢమును,వాహనరూఢమును , గురుడు చూచుచున్ననూ ,అచట యున్ననూ , ఆరూఢ లగ్నమును గానీ, కోశారూఢమును గానీ చంద్రుడు చూచుచున్ననూ , అచట యున్ననూ రాజగును. రవి,చంద్ర,కుజ,బుధ,గురు,శుక్ర, గ్రహములన్నియూ స్వక్షేత్ర , ఉచ్చలలో ఉన్నచో రాజగును. శుక్ర,చంద్రులు పరస్పర కేంద్రములలో యున్ననూ , యిరువురు కలసియున్ననూ , ఆరూఢ లగ్నాధిపతి జన్మలగ్నమునందు గానీ - వాహన రూఢాధిపతి రాశిచక్రములో వాహన మందుగానీ యున్న యొడల రాజగును.

No comments:

Post a Comment

                         https://youtube.com/shorts/flB4WlmnbLs?si=SMNTDWimlM9c0PJd